నిధులేవి?
నిర్వహణ సరే..
‘ఈ ఫొటోలో నిల్చొని ఉన్న వ్యక్తి ముస్తాబాద్ మండలం తుర్కపల్లి పంచాయతీ కార్యదర్శి. గ్రామంలో పైపులైన్ లీకేజీతో నీటిసరఫరా నిలిచిపోగా కూలీలతో మరమ్మతు చేయించారు. గత వేసవిలో నీటి ఎద్దడి నివారణకు నల్లాలు, పైపులైన్ రిపేర్లు, మోటార్ల మరమ్మతు చేయించారు. ఏడాదిగా నీటి సరఫరా నిర్వహణకు రూ.35వేలు వెచ్చించారు. చిన్న పంచాయతీ కావడం, ఇతరత్ర ఆదాయ వనరులు లేకపోవడంతో నిర్వహణ నిధుల కోసం ఎంబీ రికార్డు చేసి బిల్లులను అధికారులకు సమర్పించారు. అయితే ఏడాదిగా బిల్లులు మంజూరుకావడం లేదు. ఇది ఒక తుర్కపల్లి పంచాయతీ పరిస్థితి కాదు.. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఇదే దుస్థితి.
ముస్తాబాద్(సిరిసిల్ల): గత వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు మిషన్ భగీరథ అధికారులతోపాటు జిల్లా పంచాయతీ అధికారులు గ్రామాల్లో మరమ్మతు పనులు చేయించారు. పైపులైన్ లీకేజీలు, కొత్త పైపులైన్లు వేయడం, బోరుమోటారు మరమ్మతు, నల్లాల బిగింపు పనులను పంచాయతీ కార్యదర్శులు చేపట్టారు. అయితే, చిన్నపంచాయతీల్లో మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ నిధులు రాక కార్యదర్శులు, కారోబార్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 255 గ్రామాల్లో చేపట్టిన పనులకు రూ.60లక్షల బిల్లులు సమర్పించి నెలలు గడుస్తున్నా మిషన్ భగీరథ అధికారులు చెల్లింపులు చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు మంజూరు చేసిన అధికారులు రాజన్నసిరిసిల్ల జిల్లాకు మాత్రమే పెండింగ్ పెట్టారు.
‘మిషన్’ ఫెయిల్ కావడంతోనే..
వేసవిలోనే కాదు ఇతర రోజుల్లోనూ గ్రామంలో నీటిని అందించాల్సిన మిషన్ భగీరథ పేరుకే ఉందని విమర్శలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో భగీరథ నీరు రాక, పంచాయతీ అధికారులు, సిబ్బంది ఓపెన్‌వెల్స్, బోరుబావులు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ టేయిలెండ్ గ్రామాలకు అసలు నీటిని అందించడం లేదని పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు.
చిన్న ‘పంచాయతీ’లకే తిప్పలు
జిల్లాలో మేజర్‌పంచాయతీలతోపాటు 5వేల జనాభా ఉన్న గ్రామపంచాయతీలకు నిధుల ఇబ్బంది లేదు. కాగా, జిల్లాలో దాదాపు 200 గ్రామాల పంచాయతీ అధికారులు నిధులు లేక సతమతమవుతున్నారు. ఆదాయం ఉన్న పంచాయతీల్లో నిర్వహణ ఇబ్బంది లేకున్నా.. చిన్నపంచాయతీల్లో సిబ్బంది జీతాలకే ఎదురుచూసే పరిస్థితి. దీనికితోడు పంచాయతీలకు ట్రాక్టర్ నిర్వహణ భారంగా మారింది. ట్రాక్టర్ ఈఎంఐలతోపాటు కేంద్రం నుంచి వచ్చే ఎఫ్‌ఎఫ్‌సీ నిధుల లేమీతో పంచాయతీలు ఇబ్బంది పడుతున్నాయి. వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదని కార్యదర్శులు వాపోతున్నారు.
నిలిచిన గ్రామీణ నీటి వ్యవస్థ బిల్లులు
ఏడాదిగా సుమారు రూ.60 లక్షలు పెండింగ్
వేసవిలో చేసిన పనులకు నిధుల గ్రహణం
వారం రోజుల్లో చెల్లిస్తాం
గ్రామాల్లో నీటిసరఫరాకు మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఆపరేషన్ మెయింటనెన్స్ ద్వారా పనులు చేపట్టాం. వేసవిలో, ఇతర సమయాల్లో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చేసేందుకు పంచాయతీల ద్వారా పనులు చేపట్టాం. వారం రోజుల్లో నిధులు విడుదల చేస్తాం.
– ప్రేమ్‌కుమార్, మిషన్ భగీరథ, డీఈఈ
గ్రామాలను నిర్వీర్యం చేయొద్దు
స్థానికసంస్థల పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. చిన్నపంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవ డం లేదు. ప్రజలకు నిత్యం తాగునీ టిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మిషన్ భగీరథ విఫలమైందనడానికి ఇదే నిదర్శనం.
– మెరుగు అంజాగౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు, ముస్తాబాద్
Comments
Please login to add a commentAdd a comment