‘సెంటిమెంట్‌’.. కంటిన్యూ | Sakshi
Sakshi News home page

‘సెంటిమెంట్‌’.. కంటిన్యూ

Published Wed, Mar 27 2024 7:35 AM

- - Sakshi

జిల్లా వేదికగా జాతీయ స్థాయి గ్యారంటీలు

ఏప్రిల్‌ ఆరు లేదా ఏడు తేదీల్లో ‘జనజాతర’

కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుతోనే చేవెళ్ల అభివృద్ధి

ముఖ్య నేతల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తుక్కుగూడ వేదికగా ఎన్నిక ల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్‌ సన్నాహా లు చేస్తోంది. ఏప్రిల్‌ ఆరు లేదా ఏడు తేదీల్లో భారీ బహిరంగ సభను నిర్వహించి, జాతీయ స్థాయి గ్యా రంటీలను ప్రకటించాలని నిర్ణయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్‌ 17న ఇదే వేదిక నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం ఆరు గ్యారంటీ లను ప్రకటించిన విషయం విదితమే. ఆ తర్వాత ఆ పార్టీ అనూహ్య విజయం సాధించి, తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్‌ ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేపట్టినా చేవెళ్ల నుంచి ప్రారంభించడం అనవాయితీగా వచ్చేది. ఇది కలిసి వస్తుందని ఆ పార్టీలో నమ్మకం. ఇదే సంప్రదాయాన్ని జాతీయ స్థాయిలోనూ కొనసాగించాలని నిర్ణయించింది. తాజాగా మంగళవారం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజవర్గం ముఖ్య నేతలతో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలుపు సహా జనజాతర సభపై చర్చించారు. ఏఐసీసీ నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరు కానుండటంతో ఈ సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తోంది.

రంజిత్‌ గెలుపుతోనే..
సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగింది. చేవెళ్ల పార్టీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి ఎంతో సౌమ్యుడని, ఆయన అందరితో కలివిడిగా ఉంటారు. మంచి గుర్తింపు కూడా ఉంది. ఆయన గెలుపు కోసం పార్టీ కేడర్‌ అంతా కలిసికట్టుగా పని చేయాలి. ఇందు కోసం బంధుత్వాలను సైతం పక్కన పెట్టాలి. చేవెళ్ల అభివృద్ధి రంజిత్‌ గెలుపుపైనే ఆధారపడి ఉంది. కష్టపడి పని చేసిన నేతలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు. ఇలాంటి వారికి సరైన సమయంలో సముచిత స్థానం కల్పిస్తుంది. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి మహేశ్వరం టికెట్‌ ఆశించారు. అది దక్కక పోయినా..నిరుత్సాహపడలేదు. కష్టపడి పని చేశారు. పార్టీ ఆయనకు నామినేటెడ్‌ పోస్టును కట్టబెట్టి గౌరవించిందిశ్రీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల, మున్సిపాలిటీ, గ్రామ కమిటీలు కలిసి పని చేయాలని కోరారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజక వర్గం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతున్న వ్యక్తి పార్టీ సమావేశానికి ఏ విధంగా హాజరవుతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతుండటం కొసమెరుపు.

కేఎల్‌ఆర్‌ హాట్‌ కామెంట్స్‌
‘కష్టకాలంలో పార్టీని, కార్యకర్తలను రోడ్డున వదిలేసి వెళ్లిన వాళ్లను మళ్లీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు..? ఒకసారి మోసం చేసిన వాళ్లను మళ్లీ ఎలా తీసుకుంటారు..? ఇతర పార్టీల్లోని నేతల కోసం గేట్లు తెరిచామని పదేపదే చెబుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీ జెండాను భుజానికెత్తుకుని పని చేస్తున్న సామాన్య కార్యకర్తలు ఏమై పోవాలి..? అవకాశాలన్నీ పారాచూట్‌ లీడర్లు తన్నుకుపోతుంటే..? మాలాంటి సామాన్య కార్యకర్తలు ఎటు పోవాలి? మేం బతుకాల్నా ..? చావాల్నా..? గతంలో బీఆర్‌ఎన్‌ నేతలు చేసిన తప్పులే ప్రస్తుతం కాంగ్రెస్‌ పెద్దలు చేస్తున్నారు? ఇది ఎంత వరకు కరెక్ట్‌..? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను విస్మరించడం ఎంత వరకు సమంజసం’..? అంటూ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డి ముందే ఆవేదన వ్యక్తం చేయడం పార్టీలో కలకలం సృష్టిచింది. గతంలో పార్టీకి ద్రోహం చేసిన నేతలను మళ్లీ పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ఆయన నిలదీశారు. ‘ఇతర పార్టీల్లోని నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు గేట్లు తెరిచినట్లు పార్టీ పెద్దలు పదేపదే చెబుతుండటం ఇబ్బందికరంగా ఉంది. వారి దాష్టీకానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కాకుండా పారాచూట్‌ లీడర్లకు టికెట్లు ఇవ్వడాన్ని క్షేత్రస్థాయి కేడర్‌ జీర్ణిం చుకోలేక పోతోంది’ అని ఆయన చెప్పడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

 
Advertisement
 
Advertisement