ప్రజలకు సత్వర న్యాయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు సత్వర న్యాయమే లక్ష్యం

Published Sat, Nov 9 2024 7:15 AM | Last Updated on Sat, Nov 9 2024 7:15 AM

ప్రజలకు సత్వర న్యాయమే లక్ష్యం

ప్రజలకు సత్వర న్యాయమే లక్ష్యం

ఇబ్రహీంపట్నం: ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే కొత్త న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాథే తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 15వ అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానాన్ని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు శ్యామ్‌ కొశి, వినోద్‌కుమార్‌, లక్ష్మణ్‌, విజయసేన్‌రెడ్డితో కలిసి వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాలు ప్రజలకు చేరువగా ఉంటే.. కేసులు త్వరితగతిన పరిష్కారమై కక్షిదారులకు స్వతర న్యాయం లభిస్తుందన్నారు. సాధ్యమైనంత త్వరగా కేసులను పరిష్కరించాలని ఆయన సూచించారు. కొత్త కోర్టులకు రెగ్యులర్‌ జడ్జిలను త్వరలో నియమిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశానుసారం కొత్త న్యాయస్థానాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇబ్రహీంపట్నంతోపాటు షాద్‌నగర్‌లో అదనపు జిల్లా కోర్టును ప్రారంభించడం జరిగిందన్నారు. త్వరలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్న 1,860 కేసులను కొత్తగా ఏర్పాటు చేసిన ఇబ్రహీంపట్నం 15వ అదనపు న్యాయస్థానానికి బదిలీ అవుతాయని తెలిపారు.

ప్రత్యక్ష ప్రారంభోత్సవంలో

జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఇబ్రహీంపట్నంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన 15వ అదనపు న్యాయస్థానం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి ప్రత్యక్షంగా ఆవిష్కరించారు. నూతన 15వ అదనపు కోర్టు న్యాయమూర్తి జయప్రసాద్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. కొత్త న్యాయస్థానాల ఏర్పాటుతో వివిధ కేసుల వాదోపవాదాలు త్వరితగతిన పూర్తవుతాయని తద్వార సత్వర న్యాయం దొరుకుతుందన్నారు. కొత్త కోర్టుకు సంబంధించి న్యాయమూర్తి జయప్రసాద్‌ రెండు కేసులను కాల్‌ వర్క్‌ చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీనియర్‌ న్యాయమూర్తి శ్రీమతి శంకర్‌ శ్రీదేవి, అదనపు సీనియర్‌ న్యాయమూర్తి రీటాలాల్‌ చందు, ప్రధాన జూనియర్‌ న్యాయమూర్తి యశ్వంత్‌సింగ్‌, అదనపు జూనియర్‌ న్యాయమూర్తి హిమబిందు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అంజన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్‌, సీనియర్‌ న్యాయమూర్తులు సత్యవీర్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, ఎండీ గులాం హైదర్‌, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజీ మార్గమే రాజమార్గం

షాద్‌నగర్‌రూరల్‌: నూతన కోర్టుల ఏర్పాటుతో కోర్టు పరిధిలో ఉన్న కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాథే అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి కోర్టును శుక్రవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్‌ కేసుల్లో రాజీ మార్గమే రాజమార్గం అని అన్నారు. కేసులను త్వరతగతిన పరిష్కరించుకునేందుకు ఇరువర్గాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. నూతన కోర్టుల ఏర్పాటు న్యాయవాదులు, కక్షిదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి రత్నపద్మావతి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆంజనేయులు, స్థానిక న్యాయమూర్తులు రాజ్యలక్ష్మి, ధీరజ్‌కుమార్‌, సీనియర్‌ న్యాయవాదులు శ్వేత, జగన్మోహన్‌రెడ్డి, చెంది మహేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అబ్దుల్‌కరీం, గంగాధర్‌, రాజగోపాల్‌, నారాయణరెడ్డి, శివరాములుగౌడ్‌, సబియాసుల్తానా, రజాక్‌హుస్సేన్‌ రాజశేఖర్‌రాజు, శ్రీధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాథే

ఇబ్రహీంపట్నంలో 15వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు, షాద్‌నగర్‌లో 16వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement