మార్కెట్ అభివృద్ధికి కృషి
అబ్దుల్లాపూర్‌మెట్: బాటసింగారంలోని గడ్డిఅన్నారం వ్యయసాయ పండ్ల మార్కెట్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవ తీసుకుంటామని, వ్యాపారుల సహకారంతో మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని మార్కెట్‌కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. పాలకవర్గం, అధికారులతో కలిసి సోమవారం బాటసింగారం పండ్ల మార్కెట్‌లో కొనసాగుతున్న క్రయ విక్రయాలను పరిశీలించారు. మార్కెట్‌లో ఉన్న ప్రతి వర్తకుడి అమ్మకాలను తనిఖీ చేసి కొనుగోలుదారులు, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతోనే వ్యాపారులు రోడ్డున పడ్డారని.. వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టపోయారని విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూనే కోహెడలో నూతన మార్కెట్ నిర్మాణానికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నూతన పాలకవర్గం సహకారంతో రైతులకు న్యాయం చేస్తామని.. వచ్చే మామిడి సీజన్‌లో ఇబ్బంది లేకుండా చూసేందుకు ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. ఎక్కువ కమీషన్ తీసుకునే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని, మార్కెట్‌లోని రైతులకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర చారి, మార్కెట్ డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, అంజయ్య, మేకం లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేశ్ నాయక్, నరసింహ, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ గుప్తా, ఇబ్రహీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం
గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment