పోటెత్తిన భక్తజనం
చిలుకూరుకు
● బాలాజీ దర్శనానికి 60వేల మంది భక్తులు ● ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
మొయినాబాద్: కొత్త సంవత్సరం... కొంగొత్త ఆశలతో భక్తులంతా చిలుకూరు బాటపట్టారు. నూతన సంవత్సరం మొదటి రోజు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులకు దర్శనం కల్పింంచారు. భాగ్యం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం 11 నుంచి భక్తుల రాక పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామివారిని దర్శించుకోవడానికి నాలుగు లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందే మహిళలు, పురుషులను వేర్వేరు లైన్లలో పంపించారు. వాహనాల పార్కింగ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి మూడు వేర్వేరు దారులు ఏర్పాటు చేయడంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకుడు రంగరాజన్ పర్యవేక్షించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. గతం కంటే ఈ ఏడాది భక్తులు తక్కువగా రావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. సుమారు 60 వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ అర్చకులు, పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment