కామన్ మెనూ తప్పనిసరి
మంత్రి పొన్నం ప్రభాకర్
లాలాపేట: గత నవంబర్‌లో పెరిగిన డైట్ చార్జీలకు అనుగుణంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో కామన్ మెనూ కచ్చితంగా అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం లాలాపేటలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హాస్టల్‌లోని వంట గది, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. అధికారుల సమక్షంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పోటీ పరీక్షలకు కావాల్సిన బుక్స్, బెడ్స్, ఐరన్ ర్యాక్స్, తాగునీటి వసతి వంటి సమస్యలను విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. జనవరి 26లోగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పరీక్షలు దగ్గరపడుతున్నందున బాగా చదువుకోవాలని సూచించారు. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కామన్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వార్డెన్ స్వర్ణలత తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment