దైవనామస్మరణతో మంచి ఆలోచనలు
త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి
శంకర్‌పల్లి: దైవనామస్మరణతో రాతలు మారుతాయని, మంచి ఆలోచనలు వస్తాయని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. మున్సిపల్ పరిధిలోని సింగాపురంలో ఐదురోజుల పాటు నిర్వహిస్తున్న మరకత కార్యసిద్ధి పంచముఖ హనుమాన్ ప్రతిష్ఠాపనోత్సవాలకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగాపురంవాసులు ఆయనకి పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం చినజీయర్ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించే మరకత పంచముఖ హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని, యాగశాలను, జయ స్తంభం (రాయితో తయారు చేసిన స్తంభం)ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తారో వారి మస్తిష్కంలో చెడు ఆలోచనలు తొలగిపోతాయని అన్నారు. ప్రతి ఒక్కరికీ హనుమంతుడు పౌరుషం, విక్రమం, బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షించారు.సింగాపురంవాసుల భక్తి చూస్తే ఎంతో ఆనందం కలిగిందని, రాతి కట్టడంతో అద్భుతమైన దేవాలయం నిర్మించుకోవడం శుభపరిణామని తెలిపారు. భక్తులకు హనుమంతుని గొప్పతనాన్ని వివరించారు. దేవుడిని మట్టితో చేసినా, బంగారంతో చేసినా భక్తి మాత్రం మారకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సంతోష్, లావణ్య పాల్గొన్నారు.
మొక్కలతోనే మానవాళి మనుగడ
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలతోనే మానవాళి మనుగడ సాధ్యమని ఉత్తరాఖండ్ రాజరాజేశ్వరి ఆశ్రమం జగద్గురు శంకరాచార్య స్వామీజీ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్‌సెంటర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. వాతావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ఆశ్రమ పీఠాధిపతులు, స్వామీజీలు నందు సరస్వతి, ప్రకాశ్‌నంద, మాజీ సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment