గిరిజన సంక్షేమ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్
షాద్‌నగర్‌రూరల్: విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గిరిజన సంక్షేమ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కళాశాలలోని డైనింగ్ హాల్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్టోర్ రూంలోని వంట సామగ్రి, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. డైనింగ్ హాలులో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే కాస్మోటిక్, మెస్ చార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. ఏదైనా సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే విజయాలు వెన్నంటే ఉంటాయని అన్నారు. డిగ్రీ విద్యార్థులను మొదటి సంవత్సరం నుంచే పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేయాలని అధ్యాపకులకు సూచించారు. ఉన్నత విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మేధస్సును పెంపొందించుకొని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా, వైస్ ప్రిన్సిపాల్ కళాజ్యోతి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment