చికిత్స పొందుతూ యువకుడి మృతి
కేశంపేట: రోడ్డు ప్రమాదం ముక్కుపచ్చలారని ఓ చిన్నారికి తండ్రిని దూరం చేసింది. రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఉదంతం మండల పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోమాల్‌పల్లి గ్రామానికి చెందిన మల్లేశ్(23) లేమామిడి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స కోసం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, అటునుంచి నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు వారం రోజుల పాప ఉంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆలయ పునఃనిర్మాణానికి రూ.పది లక్షల విరాళం
నందిగామ: నందిగామ పారిశ్రామక వాడలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ పునఃనిర్మాణానికి శిశశక్తి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ యాజమాన్యం భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం పరిశ్రమ యజమానికి సునిల్ గురుస్వామి గిరిషన్ నాయర్‌కు రూ.10లక్షల నగదు అందజేశారు. ఈ సందర్భంగా గురుస్వామి గిరిషన్ నాయర్ మాట్లాడుతూ.. ఆలయ పునఃనిర్మాణానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. అనంతరం గురుస్వాములు సునిల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు సుదర్శన్ గౌడ్, హరిజీవన్, నర్సింహ యాదవ్, బాల్‌రెడ్డి, లక్ష్మయ్య యాదవ్, రాంరెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, నవాజ్‌రెడ్డి, చిందం నర్సింహ, కుమార్ గౌడ్, కొమ్ము కృష్ణ, జంగ నర్సింహయాదవ్, జంగయ్య, చించేటి కృష్ణ, కృష్ణ యాదవ్, రమేష్ చారి, నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చెట్లకు జీవం పోశారు
పహాడీషరీఫ్: మనసుంటే మార్గముంటుందని అధికారులు మరోసారి నిరూపించారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన వృక్షాలను హెచ్‌ఎండీఏ అధికారులు మరో ప్రాంతంలో నాటి జీవం పోశారు. మామిడిపల్లిలోని వివేకానంద కూడలి నుంచి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు గతేడాది 2.5 కిలోమీటర్ల మేర 150 ఫీట్లుగా పాత రోడ్డును విస్తరించారు. ఈ క్రమంలో పాత రోడ్డుపై ఉన్న చెట్లను ఎడాపెడా నరికేయకుండా పచ్చదనాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కొమ్మలు మాత్రమే నరికి, మానును మాత్రం కూకటివేళ్లతో పెకిలించి సమీపంలోని పొలాలు, ఇతర రహదారులపై నాటారు. ఏడాది అనంతరం ప్రస్తుతం ఆ మానులు జీవం పోసుకొని కొమ్మలతో చిగురించాయి.
Comments
Please login to add a commentAdd a comment