నేడు జిల్లాకు బీసీ కమిషన్ బృందం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనలో భాగంగా ఆయా రాజకీయ పార్టీలు, కుల సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం గురువారం జిల్లాకు రానుంది. రంగారెడ్డి సహా మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు, కుల సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ఈ అభిప్రాయసేకరణ కార్యక్రమానికి చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీ హాజరుకానున్నారు.
సర్వేకు వివరాలిచ్చిన కలెక్టర్
బంజారాహిల్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ కుల గణన సర్వేలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తన వివరాలు అందజేశారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని కలెక్టర్ బంగ్లాలో సూపర్‌వైజర్ అధికారి భావ్‌సింగ్, ఎన్యుమరేటర్ శాంతిలక్ష్మీ సర్వేలో భాగంగా నారాయణరెడ్డి వివరాలు నమోదు చేసుకున్నారు.
‘ట్రీ–ప్రైడ్’కు బ్రేక్
● డిసెంబర్ 1 నుంచి సబ్సిడీలు నిలిపివేత
● జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీలత
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీ–ప్రైడ్ పథకం నిలిపివేస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో టాక్సీలు, మోటార్ క్యాబ్‌లు కొనుగోలు చేసే వారికి సబ్సిడీలు అందవని చెప్పారు. టీ–ప్రైడ్ పథకంలో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ లబ్ధిదారులకు టాక్సీ, మోటారు క్యాబ్ కొరకు అందిస్తున్న రాయితీ (సబ్సిడీ) ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్ 1 నుంచి అమలవుతాయని చెప్పారు. నవంబర్ 30 వరకు కొన్న వాహనములకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ప్రశాంతంగా ఫ్యూచర్ సిటీ రహదారి సర్వే
కందుకూరు: ఫ్యూచర్ సిటీలోకి నేరుగా చేరుకునేలా నిర్మించనున్న రహదారికి అవసరమైన భూసేకరణకు రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే పనులు పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగాయి. బుధవారం రాచూలూరు రెవెన్యూ పరిధిలోని భూములను రెండో రోజు సర్వే నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్, ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ సిబ్బంది సర్వేను కొనసాగించారు. ఎవరూ పనులను అడ్డుకోకుండా రైతులతో మాట్లాడి సర్వే సాఫీగా జరిగేలా చూశారు.
‘మాలల సింహగర్జన’ను జయప్రదం చేయండి
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్ మాల
షాద్‌నగర్: మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు డిసెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే మాలల సింహగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్ మాల కోరారు. బుధవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాల మాట్లాడుతూ.. మాలలంతా ఏకమై మరో ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజ్యాంగ హక్కులను పాలకులు కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని పిలుపునిచ్చారు. హక్కుల పరిరక్షణకు మాలలంతా ఉద్యమించాలన్నారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు మాలల సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment