సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్లమెంటు సభ్యుల నిధుల (ఎంపీ లాడ్స్) ఖర్చు విషయంలో మన ఎంపీలు కొంత వెనుకబడ్డారు. పనులకు ప్రతి పాదనలు, శంకుస్థాపనలపై చూపిన శ్రద్ధ.. వాటిని పూర్తి చేయడంలో చూపడం లేదు. ఫలితంగా 17వ లోక్‌సభ కాలంలో మంజూరైన పనులు.. ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎంపీ లాడ్స్ కింద ఒక్కో సభ్యుడికి కేంద్రం ఏటా రూ.ఐదు కోట్ల నిధులు కేటాయిస్తున్న విషయం విధితమే.
చేవెళ్లలో ఖర్చు చేసింది 32 శాతమే
2019–2023 వరకు చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌కు కేంద్రం రూ.17.35 కోట్లు మంజూరు చేసింది. అప్పటి ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి జిల్లాలో రూ.15.67 కోట్ల అంచనా వ్యయంతో 289 పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన పదవీకాలం పూర్తయింది కానీ.. ఇప్పటికీ 181 పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. కేవలం రూ.5.64 కోట్ల విలువ చేసే 108 పనులు(32 శాతం) మాత్రమే పూర్తవడం గమనార్హం. ప్రస్తుత 18వ లోక్‌సభ సభ్యుడికి రూ.5 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పనికి శంకుస్థాపన కాలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
జిల్లాతో సంబంధం ఉన్న
లోక్‌సభ స్థానాల్లో ఇలా
● మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు ఎనుముల రేవంత్‌రెడ్డి రూ.కోటితో 23 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 15 మాత్రమే పూర్తయ్యాయి.
● భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.97.99లక్షలతో 75 పనులకు శంకుస్థాపన చేయగా, వీటిలో 36 మాత్రమే పూర్తి చేశారు.
● నాగర్‌కర్నూల్ లోక్‌సభసభ్యుడు పోతుగంటి రాములు రూ.1.56 కోట్ల అంచనా వ్యయంతో 40 పనులు ప్రారంభించగా, వీటిలో 29 పనులే పూర్తి చేశారు.
● మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి రూ.1.39 కోట్ల అంచనాతో 33 పనులకు శంకుస్థాపన చేయగా, వీటిలో 11 మాత్రమే పూర్తయ్యాయి.
చేవెళ్ల లోక్‌సభ స్థానంలో చేపట్టిన పనులు
సంవత్సరం అంచనా (రూ.కోట్లలో) చేపట్టిన పనులు పూర్తయినవి
2019–20 రూ.4.75 90 79
2020–21 – – –
2021–22 రూ.1.96 23 9
2022–23 రూ.4.86 93 8
2023–24 రూ.4.89 92 12
ప్రతిపాదనలు, శంకుస్థాపనలకే పరిమితం
2019–2023లో చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌లో 289 పనులకు 17.35 కోట్ల నిధులు మంజూరు
రూ.5.64 కోట్ల ఖర్చుతో 108 పనులు మాత్రమే పూర్తి
18వ లోక్‌సభ సభ్యులకు రూ.5కోట్లు మంజూరు
నేటికీ పైసా ఖర్చు చేయని ఎంపీలు
Comments
Please login to add a commentAdd a comment