ఇబ్రహీంపట్నం రూరల్: తమ ప్లాట్లను కొనాలని పిలిచి, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేయడంతో పాటు కణతకు గన్‌పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు రూ.కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నంకు చెందిన రచ్చ నారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి పది రోజుల క్రితం.. కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోవాలంటూ ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. అనంతరం ఇదే నంబర్ నుంచి ఫోన్ చేసిన మరో వ్యక్తి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా.. బొంగ్లూర్‌లో మాకు ప్లాట్లు ఉన్నాయి కొంటారా అని అడిగారు. వారం రోజులుగా తరచూ ఫోన్ చేస్తుండటంతో నిజమేనని నమ్మిన వ్యాపారి ఈనెల 21న మధ్యాహ్నం ఒంటిగంటకు డ్రైవర్ ముసీబ్‌ఖాన్‌తో కలిసి మెట్రోసిటీ వెంచర్‌కు వెళ్లాడు. ఫోన్ చేసిన వ్యక్తులు అప్పటికే అక్కడ వేచి ఉన్నారు. నారాయణ కారు దిగగానే అకస్మాత్తుగా నలుగురు వ్యక్తులు వచ్చి, డ్రైవర్‌ను దింపేసి, ముఖానికి మాస్క్, చేతులకు హ్యాండ్ కప్స్ వేసి తన కారులోనే నారాయణను తీసుకెళ్లారు. 45 నిమిషాల తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లి కట్లు విప్పారు. ఈ సమయంలో పోలీసు యూనిఫాం ధరించి ఉన్న ఓ వ్యక్తి నారాయణ కణతపై తుపాకీ పెట్టి, కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో వారి వద్ద ఉన్న పది పేపర్లపై అతని సంతకం, వేలి ముద్రలు తీసుకున్నారు. తర్వాత కారులో ఎక్కించుకుని సాయంత్రం నాలుగు గంటలకు చండూరులోని ఓ వెంచర్లో వదిలేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన దుండగులు
ఖాళీ పేపర్లపై సంతకాలు, వేలిముద్రల సేకరణ
కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment