ధనాధన్ రిచ్!
జిల్లా తలసరి ఆదాయం
(రూ.లక్షల్లో)
రంగారెడ్డి 11.46
గుర్గావ్ 9.05
బెంగళూరు 8.93
ముంబై 6.57
అహ్మదాబాద్ 6.43
గాంధీనగర్ 6.03
హైదరాబాద్ 5.39
చైన్నె 5.20
ఎస్‌సీటీ ఢిల్లీ 5.01
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా రంగారెడ్డి అవతరించింది. తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) ప్రకారం దేశంలోని 25 సంపన్న జిల్లాల్లో రంగారెడ్డికి తొలి స్థానం దక్కగా.. 18వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది. జాతీయ తలసరి ఆదాయం (పీసీఐ) కంటే రంగారెడ్డి పీసీఐ 5 రెట్లు అధికంగా ఉంది. నేషనల్ పీసీఐ రూ.2.25 లక్షలుగా ఉండగా.. రంగారెడ్డి తలసరి ఆదాయం రూ.11.46 లక్షలు. ఇక, హైదరాబాద్ పీసీఐ రూ.5.39 లక్షలు.
శక్తిమంతమైన వాణిజ్య కేంద్రంగా..
పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో మిళితమై ఉన్న రంగారెడ్డి జిల్లా వ్యవసాయ, ముడి పదార్థాల ఉత్పత్తులతో పాటు శక్తిమంతమైన వాణిజ్య కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాల కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దీంతో నివాస, వాణిజ్య సముదాయాల మార్కెట్‌కు డిమాండ్ ఏర్పడింది. సేవలు, ఆదాయం ఉత్పాదకత ఒక నిర్దిష్ట ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండటంతో తలసరి ఆదాయ పరంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అంతరం చాలా ఎక్కువ ఉంది. అంతేకాకుండా హైదరాబాద్‌లో పాతబస్తీ, ముషీరాబాద్, అంబర్‌పేట వంటి రద్దీ ప్రాంతాలున్నాయి. దీంతో విశాలమైన, విలాసవంతమైన అవసరాల కోసం రంగారెడ్డి వైపు విస్తరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తలసరి ఆదాయం పెరుగుదలతో సంక్షేమ చర్యలు, ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన పరంగా ఉపయుక్తమవుతుంది.
ఐటీ, రియల్టీలతో వృద్ధి..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ రంగాలు రంగారెడ్డికి మణిహారంగా మారాయి. హైదరాబాద్ లోని పశ్చిమ ప్రాంతంలో స్థలం కొరత, రద్దీ తది తర కారణాలతో స్థానిక ఐటీ, ఇతర సంస్థలు జిల్లా వైపు విస్తరిస్తున్నాయి. కొన్నేళ్లుగా స్థానిక ప్రభుత్వాలు కూడా ఢిపెన్స్, ఫార్మా క్లస్టర్లు, తయారీ కేంద్రాల వంటి కొత్త ప్రాజెక్ట్‌లను సైతం ఈ జిల్లా వైపే మళ్లించాయి. దీంతో స్థానికంగా భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. భూ లావాదేవీలు, తలసరి ఆదాయం పెరిగాయి. హెదరాబాద్ కంటే ధనిక జిల్లాగా రంగారెడ్డి అభివృద్ధి చెందింది.
దేశంలోనే అత్యంత సంపన్న జిల్లా రంగారెడ్డి
తలసరి ఆదాయం రూ.11.46 లక్షలు
ఇది దేశ పీసీఐ కంటే 5 రెట్లు అధికం
రూ.5.39 లక్షలతో హైదరాబాద్ 18వ స్థానం
ఐటీ, ఫార్మా, రియల్టీ రంగాలతోనే ఈ అభివృద్ధి
Comments
Please login to add a commentAdd a comment