అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
షాద్‌నగర్ రూరల్: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుశీల తెలిపిన ప్రకారం.. పట్టణంలోని పటేల్‌రోడ్డులోని మసీద్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనాస్థలికి వెళ్లి విచారించగా మృతుడి ఆచూకీ తెలియరాలేదు. మృతుడు భిక్షాటన చేస్తుండేవాడని స్థానికులు చెప్పారు. మృతుడు లైట్‌బ్లూ టీషర్ట్, చాక్లెట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి సంబంధీకులుంటే 8712663329 నంబర్‌లో సంప్రదించాలన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
రోడ్డు దాటుతుండగా..
డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
షాద్‌నగర్ రూరల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని డీసీఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన పట్టణంలోని మహబూబ్‌నగర్ రోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన సొన్నాయిల వెంకటేశ్(42), విజయ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు షాద్‌నగర్ పట్టణంలో కొత్తగా ఇల్లు కొనుగోలు చేశారు. ఇంటి పనులు చూసుకునేందుకు దంపతులు పట్టణానికి వచ్చారు. సాయంత్రం వెంకటేశ్ టీ తాగేందుకు నడుచుకుంటూ వెళ్లి తిరిగి వస్తుండగా.. పట్టణ కూడలి నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం ఆయన్ను బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ వాహనంతో సహా అంతే వేగంతో పరారయ్యాడు. వెంకటేశ్ తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అనంతరాములు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment