క్రమబద్ధీకరణ అపరిష్కృతం | - | Sakshi
Sakshi News home page

క్రమబద్ధీకరణ అపరిష్కృతం

Published Tue, Dec 24 2024 7:19 AM | Last Updated on Tue, Dec 24 2024 7:19 AM

క్రమబద్ధీకరణ అపరిష్కృతం

క్రమబద్ధీకరణ అపరిష్కృతం

ఆక్రమిత స్థలాల రెగ్యులరైజేషన్‌ అంశంపై ఎటూ తేల్చని ప్రభుత్వం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చక లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ ప్రక్రియకు ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులు చెల్లించి ఏడాదవుతున్నా.. ఇప్పటి వరకు భూమిని రిజిస్ట్రేషన్‌ చేయక పోవడం, చేసినవి సేల్‌డీడ్లు పంపిణీ కాకపోవడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. తీరా రిజిస్ట్రేషన్‌ సమయంలో క్రమబద్ధీకరణలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ జీఓలను రద్దు చేసింది. సమగ్ర విచారణ తర్వాత ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు అప్పట్లో ప్రకటించింది. అయితే జీఓ రద్దు ప్రకటన చేసి ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ అంశంపై తుది నిర్ణయం తీసుకోక పోవడంతో స్థలాల క్రమబద్ధీకరణకు అప్పులు చేసి, బ్యాంకుల్లో జమ చేసిన లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు.

రెండు దఫాల్లో అవకాశం

ఆక్రమణ దారుల చేతుల్లో ఉన్న ఎలాంటి వివాదం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు విడతల్లో(తొలుత 2020లో, రెండోదఫా 2022లో) జీఓ నంబర్‌ 58, 59లను తీసుకొచ్చింది. తొలుత 2014 జూలై 2 కటాఫ్‌ డేట్‌ ప్రకటించింది. ఆ తర్వాత 2020 జూలై 2 కటాఫ్‌ డేట్‌గా ప్రకటించింది. దరఖాస్తుదారు ఇందుకు ఏదో ఒక (ఇంటి నంబర్‌, కరెంట్‌ బిల్లు, నల్లాబిల్లు, ఆస్తిపన్ను చెల్లింపు రసీదు) ఆధారాన్ని సమర్పించాల్సిందిగా సూచించింది. జీఓ నంబర్‌ 58 కింద 120 గజాలలోపు ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించింది. ఈ జీఓ కింద మొత్తం 29,807 దరఖాస్తులు రాగా, వీటిలో 7,911 దరఖాస్తులు క్రమబద్ధీకరణకు అర్హత పొందాయి. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 21,896 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 2,696 మందికి పట్టాలను పంపిణీ చేయగా, మరో 5,215 మందిది పెండింగ్‌లో ఉంది.

రిజిస్ట్రేషన్లు కాక..కట్టిన ఫీజు వెనక్కిరాక

ఇక జీఓ నంబర్‌ 59 కింద జిల్లా వ్యాప్తంగా 24,016 దరఖాస్తులు రాగా.. వీటిలో 6,801 దరఖాస్తులకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. వీటిలో 4,705 క్రమబద్ధీకరణకు అనుమతి పొందగా, మరో 1,312 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 2,455 మంది క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించారు. వీరిలో అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, శేరిలింగంపల్లి మండలాల్లోనే అత్యధికం ఉన్నారు. అప్పటికే కొంత మందికి రిజిస్ట్రేషన్లు చేసి, డాక్యుమెంట్లను వారి చేతికి ఇవ్వగా, తీరా ప్రభుత్వ ప్రకటనతో మరికొంత మందివి నిలిచి పోయాయి. ఏడాదైనా బ్యాంకుల్లో చెల్లించిన సొమ్ము వెనక్కి రాకపోగా, భూమి తమ పేరున రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో లబ్ధిదారులంతా ఆందోళన చెందుతున్నారు. వీరితో పాటు ఎల్బీనగర్‌, జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో అర్బన్‌ సీలింగ్‌ భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 118 జీఓ కింద జారీ చేసింది. ఈ జీఓ కింద ఒక్క ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే ఐదు వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోవడంతో ఆయా బాధితులంతా ఆందోళన చెందుతున్నారు.

జీఓ నంబర్‌ 58, 59 కింద వచ్చిన దరఖాస్తులు

మండలం జీఓ నంబర్‌ 58 జీఓ నంబర్‌ 59

అబ్దుల్లాపూర్‌మెట్‌ 4005 7903

ఆమనగల్‌ 114 84

బాలాపూర్‌ 7006 967

చేవెళ్ల 148 60

ఫరూఖ్‌నగర్‌ 22 13

గండిపేట 1716 908

హయత్‌నగర్‌ 2274 2614

ఇబ్రహీంపట్నం 331 626

చౌదరిగూడ 11 37

కడ్తాల్‌ 06 04

కందుకూరు 20 135

కేశంపేట్‌ 10 25

కొందుర్గు 16 04

కొత్తూరు 19 95

మాడ్గుల 03 13

మహేశ్వరం 405 180

మంచాల 41 82

మెయినాబాద్‌ 43 203

నందిగామ 06 07

రాజేంద్రనగర్‌ 2142 531

సరూర్‌నగర్‌ 3228 2234

శేరిలింగంపల్లి 7830 5834

షాబాద్‌ 07 02

శంషాబాద్‌ 120 149

శంకర్‌పల్లి 199 1094

తలకొండపల్లి 44 109

యాచారం 41 77

జిల్లాలో జీఓ 58, 59 కింద 53,823 దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి జీఓలను రద్దు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆందోళనలో ఫీజులు చెల్లించిన దరఖాస్తుదారులు

దస్త్రాలు మాయం?

జీఓ నంబర్‌ 58, 59లను అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు ఖరీదైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలంతా అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉండగా, ఇందుకు ఒక రోజు ముందే గోపన్‌పల్లి సర్వే నంబర్‌ 74లో 12,879 గజాల స్థలాన్ని 30 మంది పేరున క్రమబద్ధీకరించారు. నానక్‌రాంగూడ సర్వే నంబర్‌ 149లో ఐదు ఎకరాల భూమిని 15 మంది పేరిట క్రమబద్ధీకరించారు. అదే రోజు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల పేరున కన్వెయన్స్‌ డీడ్‌లు కావడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. సంబంధిత దస్త్రాలన్నీ మాజీ అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి వద్దకు పంపింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన అవినీతి కేసులో అరెస్ట్‌ కావడం తెలిసిందే. ఇక్కడ మూడు దఫాలుగా స్థలాల క్రమబద్ధీకరణ జరగడం, ప్రస్తుతం తహసీల్దార్‌, ఆర్డీఓ, కలెక్టరేట్‌లోనూ ఈ కీలక దస్త్రాలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement