ధ్యానంతో ఆత్మజ్ఞానం
ధ్యాన గురువు పరిణిత పత్రి
● మూడవ రోజు ఆధ్మాత్మిక పుస్తకాల ఆవిష్కరణ ● అలరించిన కూచిపూడినృత్యప్రదర్శనలు
కడ్తాల్: ధ్యానంతో ఆత్మజ్ఞానం పెంపొందించుకోవాలని ధ్యాన గురువు పరిణిత పత్రి అన్నారు. మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో కొనసాగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు సోమవారానికి మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సంజయ్ కింగీ ఆధ్వర్యంలో ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం పరిణిత పత్రి మాట్లాడుతూ.. ఖనిజ, వృక్ష, జంతురాజ్యం నుంచి మానవుడిగా పరిణతి చెందుతామన్నారు. మన శరీర అభివృద్ధి మాదిరిగానే ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ధ్యానులు వ్యక్తిగత చైతన్యంతో పాటు సామూహిక చైతన్యం పెంపొందించుకోవాలన్నారు. పీఎస్‌ఎంఎం అంటే స్వేచ్ఛ, కరుణ, స్నేహం, ఆధ్యాత్మిక శాస్త్రమని.. అందరినీ కలుపుకొని వెళ్లడమేనని చెప్పారు. అనంతరం ధ్యాన మహాయాగంలో పత్రీజీ వీడియో సందేశం ద్వార ధ్యానులకు ‘ఐదు వేళ్లు’ విశిష్టతపై ధ్యాన సందేశం అందించారు. అనంతరం పలు ఆధ్యాత్మిక పుస్తకాలను, నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి గురువులు ఆధ్యాత్మిక, ధ్యాన సందేశం వివరించడంతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి పిరిమిడ్ మాస్టర్లు తమ ధ్యాన అనుభవాలను వివరించారు. బెంగళూర్‌కు చెందిన హయన అకాడమీ కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ధ్యానులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు హనుమంతరాజు, సాంబశివరావు, శ్రీరాంగోపాల్, రాంబాబు, దాట్ల హనుమంత రాజు, బాలకృష్ణ, లక్ష్మీ, దామోదర్‌రెడ్డి, మాధవి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment