‘ఆట’ంకం!
● ఆటస్థలాల్లో సభలు, విజయోత్సవాలు ● వేదికగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ● క్రీడాకారుల సాధనకు అవరోధం ● నిరోధించాలంటున్న క్రీడాభిమానులు
హుడాకాంప్లెక్స్: ఆట మైదానాలు సభలు, సమావేశాలు, విజయోత్సవాలకు వేదికగా మారుతున్నాయి. క్రీడాకారులు.. కోచ్‌లు.. క్రీడాభిమానులతో నిత్యం కళకళలాడాల్సిన స్టేడియాలు మైక్‌లు, నినాదాలు, డీజేల హోరుతో దద్దరిల్లిపోతున్నాయి. క్రీడా మైదానాల్లో ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వబోమని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లా క్రీడల శాఖ అధికారులు అడ్డగోలుగా వేడుకలకు కేటాయిస్తున్నారు. ఫలితంగా ఆయా క్రీడాంశాల్లో శిక్షణ పొందుతున్న భావి క్రీడాకారులకు శ్రీఆటశ్రీంకం తప్పడం లేదు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం క్రీడలకు విరుద్ధంగా రాజకీయ బహిరంగ సభలు, సమావేశాలు, సినిమా విజయోత్సవాలు, పాటల కచేరీలకు అడ్డాగా మారుతోంది.
పలు క్రీడాంశాల్లో శిక్షణ
క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి, ప్రోత్సహించేందుకు 23 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఎల్‌బీనగర్ సమీపంలోని 17 ఎకరాల్లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేసింది. ఇండోర్ సహా అవుట్‌డోర్ స్టేడియాలు ఉన్నాయి. ఇక్కడ క్రికెట్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కరాటే, స్కేటింగ్, స్విమ్మింగ్ పోటీల్లో శిక్షణ ఇస్తుంటారు. ఆరేళ్ల వయసు వారి నుంచి అరవై ఏళ్ల వయసు వారు కూడా ఆయా అంశాల్లో సాధన చేస్తుంటారు. క్రీడాకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడాల్సిన స్టేడియం పూర్తిగా రాజకీయ, సినిమా, కార్పొరేట్ స్కూళ్ల వార్షికోత్సవాలు, సభలకు, సమావేశాలకు పరిమితం అవుతోంది.
శిక్షణకు తప్పని ఇబ్బంది
నిర్వాహకులు సభాస్థలి కోసం రెండు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తుంటారు. షామియానా, కుర్చీలు, బారికేడ్లు, కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపుతున్నారు. బహిరంగ సభ/ సమావేశానికి రెండు రోజుల ముందు, ఆ తర్వాత మరో రెండు రోజుల పాటు ప్రాక్టీసును నిలిపేయాల్సి వస్తోంది. ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉండాల్సిన స్టేడియం డీజే సౌండ్స్‌తో మోతమోగుతోంది. క్రీడాకారులే కాదు చుట్టుపక్కల వారి ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి.
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం
వాకింగ్‌కు కష్టమవుతోంది
ఇంటికి సమీపంలోనే స్టేడి యం ఉంది. నాతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా ప్రతిరోజు ఇక్కడికి వా కింగ్‌కు వస్తుంటాం. సభ లు, సమావేశాలు నిర్వహించడంతో క్రీడాకారులతో పాటు నిత్యం వాకింగ్ చేసే వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. పారిశుద్ధ్య సమస్యకు తోడు ట్రాఫిక్, శబ్ద కాలుష్యం తలెత్తుతోంది.
– డాక్టర్ ఏపీ చారి, డాక్టర్స్‌కాలనీ
బయటే కేటాయించాలి
క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన మైదానాలు రాజకీయ శిబిరాలకు వేదికగా మారుతుండటం దురదృష్టకరం. సభలు, సమావేశాలకు అవుటర్ బయటే అవకాశం ఇవ్వాలి. క్రీడాకారులకు కేటాయించిన మైదానాల్లో వారికే ప్రాధాన్యం దక్కాలి.
– ఎం.సుకుమార్,
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
శిక్షణకు దూరమవుతున్నారు
స్టేడియంలో మా పిల్లలకు స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 ఫీజు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం ప్రాక్టీసు చేయించాల్సి ఉంది. సభలు, సమావేశాలకు స్టేడియాన్ని కేటాయిస్తుండటంతో నెలలో నాలుగైదు రోజులు శిక్షణకు దూరమవ్వాల్సి వస్తోంది.
– గుర్రం చంద్రశేఖర్, పేరెంట్
Comments
Please login to add a commentAdd a comment