రోజంతా కూల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో గురువారం ఉదయం నుంచి రోజంతా ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం మబ్బులు కమ్మేసి ఉండటం.. సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో అప్పటికే వివిధ పనుల కోసం బయటికి వెళ్లిన వాహనదారులు, వీధి వ్యాపారులు, పాదచారులు తడిసి ముద్దయ్యారు. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చిరుజల్లులకు చలిగాలులు తోడవడంతో చిన్నారులు, వృద్ధులు గజగజ వణికిపోయారు. చలికారణంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఆఫ్ చేశారు. ఫలితంగా రోజు వారీ విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. డిసెంబర్ 19న అత్యధికంగా 3,145 మెగావాట్ల (60.25 మిలియన్ యూనిట్లు) డిమాండ్ నమోదు కాగా, 25న అత్యల్పంగా 3,039 మెగావాట్లు (57.58 ఎంయూ)లు రికార్డు అయింది. తాజాగా గురువారం 2,940 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం. అర్ధరాత్రి, మధ్యాహ్నం వేళతో పోలిస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా నమోదవుతుండటం విశేషం. వేడినీళ్ల కోసం గీజర్లు, హీటర్లు వాడుతుండటమే ఇందుకు కారణమని ఇంజనీర్లు చెబుతున్నారు.
మారిన వాతావరణం
ఉదయం మబ్బులు
సాయంత్రం జల్లులు
చలికి గజగజ వణికిన జనం
తగ్గిన విద్యుత్ వినియోగం
Comments
Please login to add a commentAdd a comment