సాంకేతిక పరిజ్ఞానంతో చెరువుల సర్వే
తుర్కయంజాల్: పూర్తిగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెరువులను సర్వే చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఐఐటీ, బిట్స్‌పిలానీ సభ్యులతో కమిటీ వేసి చెరువుల హద్దులను ముందుగా నిర్ణయిస్తామని వెల్లడించారు. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని మాసబ్ చెరువు, జిలావర్‌ఖాన్ చెరువులను బుధవారం ఆయన అధికార బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకూడదని సూచించారు. ఎవరో ఒకరికి సాయం చేయడం కోసం మరొకరిని బలిచేయబోమన్నారు. ఏది ఉన్నా నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని పేర్కొన్నారు. అమీన్‌పూర్, నల్లగండ్లలో చెరువులు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా విస్తరించి ఉన్నాయనే ఫిర్యాదులు వచ్చాయని, అదే తరహాలో మాసబ్ చెరువుపై కూడా వాదనలు వినిపిస్తున్నాయని చెప్పారు. మూడు, నాలుగు నెలల్లో మాసబ్ చెరువును పూర్తిగా సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల నిర్ధారణ తరువాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, ప్రజల నుంచి వినతులు, అభ్యంతరాలు స్వీకరిస్తామని ఆయన వివరించారు.
అలుగును సర్వే చేస్తాం
రంగనాథ్ ముందుగా తుర్కయంజాల్ రెవెన్యూ సర్వే నంబర్ 205లోని 12 ఎకరాల భూమిలో మట్టి డంప్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో భూ యజమానులు వచ్చి తమకు న్యాయం చేయాలని కోరగా చెరువును పూర్తిగా సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు. అనంతరం ఆదిత్యానగర్‌లో ఎఫ్‌టీఎల్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. ఉన్న ఆస్తులు అమ్మి రూ.లక్షలు పెట్టి ప్లాట్లను కొనుగోలు చేసి, ఇళ్లు కట్టుకున్నామని.. ప్రభుత్వం తమ జోలికి రావద్దని పలువురు మహిళలు ఆయనకు విన్నవించారు. హైడ్రా అనేది కేవలం భూ కబ్జాదారుల మీద పడేది మాత్రమేనని, ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న అమాయకుల జోలికి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. చెరువులు మురుగు నీరు చేరుతుండడం చూసి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డికి సూచించారు. అలుగు ఎత్తు పెంచడంతో తమ ఇళ్లు, పొలాలు మునుగుతున్నాయని పలువురు రైతులు వాపోయారు. అలుగును సర్వే చేస్తామని, తూములను కేవలం వ్యవసాయ పొలాలకు నీరు అందించడానికి ఏర్పాటు చేసినవి మాత్రమేనని చెప్పారు.
ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మి మోసపోవద్దు
ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోం
నిబంధనల ప్రకారం నడుచుకుంటాం
మాసబ్ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఆ మట్టిని తొలగిస్తాం
చెరువు శిఖం సర్వే నంబర్ 137లో రోడ్డు వేయడానికి డంప్ చేసిన మట్టి, బండరాళ్లను తొలగిస్తామని రంగనాథ్ వెల్లడించారు. ఇలానే వదిలేస్తే బఫర్ జోన్ బయట ఉన్న వారికి కూడా ప్రమాదం పొంచి ఉంటుందని, వెంటనే మధ్యమధ్యలో రోడ్డును తవ్వి నీరు పోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు వేయడానికి ప్రయత్నించిన వారెవరు, దీంతో ఎవరికి ప్రయోజనం చేకూరనుంది అనే దానిపై ఆరా తీశారు. బఫర్ జోన్ దాటి రోడ్డు వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తర్వాత ఆయన ఇంజాపూర్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద జిలావర్‌ఖాన్ చెరువులోకి నీరు వెళ్లే కాలువను పరిశీలించారు. జిలావర్‌ఖాన్ చెరువు గతంలో 30 ఎకరాలకే నోటిఫికేషన్ ఇచ్చారని, ప్రస్తుతం 130కి పైగా ఎకరాల్లో విస్తరించి ఉందని అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment