గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఔత్సాహిక విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుందని తెలిపారు. గురుకులాల్లో విద్యను అభ్యసించాలని భావించిన బాలబాలికలు https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కుల ధ్రువీకరణ పత్రం నంబర్, ఆదాయ ధ్రువీకరణ పత్రం నంబర్, ఆధార్ కార్డు నంబర్, బర్త్ సర్టిఫికెట్, ఫొటో అవసరమని తెలిపారు. ఆయా ధృవీకరణ పత్రాల జారీ కోసం కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమావేశంపై వాగ్వాదం
కందుకూరు: ఫ్యూచర్ సిటీ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో అధికారులు చేపట్టిన సమావేశం విషయమై అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం లేమూరు రెవెన్యూ పరిధిలో ఫ్యూచర్ సిటీ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో భూసేకరణ విషయమై చర్చించడానికి ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న లేమూరు రైతులతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని రైతులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆర్డీఓ మరోసారి భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమవుదామని చెప్పి అక్కడి నుంచి అందరినీ పంపించి వేశారు.
మరకత శివాలయం
మహాద్భుతం
శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో వెలసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఏదో తెలియని మహిమ దాగుందని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప మనుమడు, అమేయ గ్రేగ్ గ్రూప్ అధినేత నిఖిల్ చంద్ర ముళ్లపూడి, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, సినీ నటి కారుణ్య చౌదరి అన్నారు. బుధవారం వారు ఆలయాన్ని దర్శించారు. లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ దేవాలయ ప్రాముఖ్యత, విశిష్టత గురించి ఎంతో మంది చెప్పారని.. ఈరోజు ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆలయంలో ఏదో అద్భుత శక్తి దాగి ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని సన్మానించి, మరకత శివాలయ పటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్‌చైర్మన్ శేఖర్, సభ్యులు హనుమంతు, మాజీ సర్పంచి శ్రీనివాస్, అర్చకుడు శివసాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భగవద్గీత కంఠస్థ పోటీల్లో గోల్డ్‌మెడల్
షాబాద్: బెంగళూరు శ్రీ దత్తపీఠం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీల్లో షాబాద్ ధ్యానహిత పాఠశాలకు చెందిన సాయి సుప్రీత్ బంగారు బహుమతి గెలుచుకున్నారు. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా సాయి సుప్రీత ఈ బంగారు పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని అందకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం సుప్రీత్‌ను, తల్లిదండ్రులను అభినందించింది.
Comments
Please login to add a commentAdd a comment