మైనింగ్ వద్ద పేలుడు పదార్థాలు స్వాధీనం
ఆమనగల్లు: కడ్తాల్ మండలం చల్లంపల్లి గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 82లో ఉన్న మైనింగ్ వద్ద అక్రమంగా నిలువ ఉంచిన 13 కట్టల పేలుడు పదార్థాలు (డిటోనేటర్స్) స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చల్లంపల్లి సమీపంలోని మైనింగ్ వద్ద తనిఖీ చేయగా అక్కడ ఉన్న షెడ్డులోని బ్యాగులో పేలుడు పదార్థాలు గుర్తించినట్టు చెప్పారు. అక్కడే ఉన్న సూపర్‌వైజర్ శంకర్‌ను ప్రశ్నించగా తాను మూడేళ్లుగా సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నానని, మైనింగ్ వద్ద జై భవానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ నిర్వాహకుడు రాజేందర్ బ్లాస్టింగ్ పనులను నిర్వహిస్తాడని తెలిపాడు. రెండు రోజుల క్రితం డిటోనేటర్లు తీసుకువచ్చి ఇక్కడే ఉంచినట్లు చెప్పాడు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో డిటోనేటర్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, సూపర్‌వైజర్ శంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. బ్లాస్టింగ్ నిర్వాహకుడు రాజేందర్, మైనింగ్ కంపెనీ యజమాని అశ్వనీ, కేర్‌టేకర్ శ్రీనివాస్‌పై కూడా కేసు నమోదు చేశామని.. వారు పరారిలో ఉన్నారని తెలిపారు.
పౌల్ట్రీ ఫాం యజమానిపై కేసు నమోదు
ఆమనగల్లు: కడ్తాల్ మండల సమీపంలోని పౌల్ట్రీఫాంలో బాలుడిని పనిలో పెట్టుకున్నందుకు ఫాం యజమాని సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు. ఫౌల్ట్రీఫాం యజమాని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 16 సంవత్సరాల బాలుడిని పనిలో పెట్టుకున్నాడని చెప్పారు. కడ్తాల్ పోలీసులు, షాద్‌నగర్ షీటీం పోలీసులు తనిఖీలు నిర్వహించి బాలుడిని పనిలో పెట్టుకున్నట్లు గుర్తించినట్లు వివరించారు. ఈ మేరకు యజమాని సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్‌గా యాదిరెడ్డి
చేవెళ్ల: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో తనకు అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని మల్కాపూర్ గ్రామానికి చెందిన పార్టీ లీగల్‌సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్, న్యాయవాది బక్కరెడ్డి యాదిరెడ్డి అన్నారు. చేవెళ్లలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ లీగల్‌సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా తనని లీగల్‌సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ నియమించి నియామకపత్రం అందజేసినట్లు తెలిపారు. పార్టీ బలోపేతంలో లీగల్‌సెల్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ కమిటీలో తనకు అవకాశం కల్పించిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మాజీ ఉంసీ గడ్డం రంజిత్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గం ఇన్‌చార్జి పామెన భీంభరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment