ఫ్యూచర్‌సిటీ రహదారికి భూములివ్వం
కందుకూరు: ఫ్యూచర్ సిటీ రహదారికి భూములు ఇచ్చేదిలేదని బాధిత రైతులు తీర్మానించారు. మండల పరిధిలోని లేమూరులో ఆదివారం ఫ్యూచర్ సిటీ రహదారిలో భూములు కోల్పోతున్న ఐదు గ్రామాల రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు డి.సుధాకర్, నారాయణ, ఢిల్లీ గణేశ్, స్వామి, కె.గణేశ్, కె.ఐలయ్య, ప్రశాంత్‌రెడ్డి, కె.రాజు తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోకి వంద మీటర్ల మేర రహదారి నిర్మించడానికి తమ భూముల నుంచి సర్వే చేసి హద్దురాళ్లు పాతిందని తెలిపారు. తమకు అరకొర పరిహారం ఇవ్వడానికి చూస్తోందని, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో తమ భూముల విలువ దాదాపు ఎకరం ధర రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతోందన్నారు. అంత డబ్బు ప్రభుత్వం ఇవ్వదని, అందుకోసం తమ భూములు ఇవ్వడానికి అంగీకరించేదిలేదన్నారు. కొత్తగా రహదారి నిర్మించే బదులు శ్రీశైలం రహదారిని తుక్కుగూడ నుంచి కొత్తూరు గేట్ వరకు గతంలో నిర్మించిన ఫార్మా రహదారిని కలిపేలా విస్తరించేలా ఆలోచించాలన్నారు. దీంతో రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. వీరికి సీపీఎం నాయకులు డి.రాంచందర్, బుట్టి బాల్‌రాజు తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో రైతులు అనూరాధ, కృష్ణవేణి, రమేష్, తిరుపతయ్య, రాములు, వీరయ్య, జంగయ్య, నారాయణ, రాములు తదితరులు పాల్గొన్నారు.
తేల్చి చెప్పిన బాధిత రైతులు
Comments
Please login to add a commentAdd a comment