యాచారం: పట్టా రైతులకు మళ్లీ నోటీసులు అందాయి. ఫార్మాసిటీ కోసం బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పట్టా భూములు ఇవ్వకపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న మధ్యాహ్నం 3గంటలకు వ్యక్తిగతంగా హాజరై అభ్యంతరాలు తెలియజేయాలని సూచిస్తూ సెక్షన్ 15(2) ఆఫ్ యాక్ట్ ఆఫ్ 2013 కింద నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన దాదాపు 1,500 మందికి పైగా రైతులు సుమారు 2,200 ఎకరాలకుపైగా పట్టా భూములను ఫార్మాసిటీకి ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయంలో అప్పటి అధికారులు బాధితులను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో చేసేదేమీ లేక హైకోర్టును ఆశ్రయించారు. ఈఅంశాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు 2,200 ఎకరాలకు పైగా పట్టా భూములకు సంబంధించి రాత్రికిరాత్రే అవార్డు పాస్ చేసి, పరిహారం డబ్బులను అథారిటీలో జమచేశారు. అనంతరం భూసేకరణ సేకరణ ప్రక్రియ పూర్తయినట్లు భావించి రైతుల భూరికార్డులను టీజీఐఐసీ మీద మార్చేశారు. టీజీఐఐసీ పేరు మీద మార్చిన భూ రికార్డులను తమ పేర్లపైకి బదిలీ చేయించాలంటూ బాధితులు న్యాయస్థానం మెట్లెక్కారు. దీంతోపాటు ఐదేళ్లుగా సీసీఎల్‌ఏ, కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, యాచారం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండాపోయింది. టీజీఐఐసీ పేరున కొనసాగుతున్న భూములను తమ పేర్లపై మార్చాలని కోరుతూ రైతులు గత గురువారం స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిశారు. వెంటనే స్పందించిన ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరించారు. సదరు భూములను రైతుల పేరున మార్చాలని కోరారు. అనంరతం రైతులు నేరుగా వెళ్లి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కానీ మరుసటి రోజునే వ్యక్తిగత నోటీసులు అందించడంపై బాధితులు విస్మయానికి గురయ్యారు. ఇదే విషయమై యాచారం తహసీల్దార్ అయ్యప్పను సంప్రదించగా పట్టా భూముల సేకరణ, రైతుల అభ్యంతరాలు, కోర్టుకు వెళ్లిన అంశాలను తెలుసుకునేందుకు కలెక్టర్ జారీ చేసిన నోటీసులను రైతులకు అందిస్తున్నామని తెలిపారు.
వ్యక్తిగతంగా హాజరు కావాలని కలెక్టర్ తాఖీదులు
ఫార్మా బాధిత రైతుల్లో ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment