పాట ఉన్నంతకాలం గద్దర్ ఉంటారు
● స్పీకర్ ప్రసాద్‌కుమార్ ● ఘనంగా 77వ జయంతి
అనంతగిరి: గద్దర్ అనేది ఒక పేరు కాదు అది ఒక కెరటం అని, సమాజంలో జరుగుతున్న అన్యాయంపై పాట రూపంలో తిరగబడిన బల్లెం అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో శుక్రవారం తెలంగాణ సాంస్కృతిక సారథి, భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్పీకర్. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గద్దర్‌తో రాజకీయ నాయకులకు సిద్ధాంత పరమైన విభేదాలు ఉండొచ్చే కానీ బడుగు, బలహీన వర్గాలకు న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. దొరతనాన్ని ఎదిరించి గజ్జె కట్టి పాట పాడినా, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఊరూరా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసినా అది సమాజాన్ని మేల్కోలిపే ఉద్యమమే అన్నారు. కళాకారులు గద్దర్‌ను స్మరిస్తూ పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజా ప్రభుత్వం వచ్చాక గద్దర్‌ను కళాకారుడిగా, తెలంగాణ ఆస్తిగా గుర్తించిందని తెలిపారు. సినిమా కళాకారులకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించిందని గుర్తు చేశారు. గద్దర్ కూతురు వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథిగా నియమించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, డీపీఆర్‌ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ పథకాలు
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ మండలంలో శుక్రవారం రూ.8.43 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ ఉమేష్, ఆర్టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, జెడ్పీటీసీ మాజా సభ్యుడు మైపాల్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో వినయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ప్రత్యేక అధికారులు ప్రసన్నలక్ష్మి, కల్పన, పంచాయతీ కార్యదర్శులు శిల్ప, రుక్మిణి, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం వికారాబాద్‌లో అవగాహన కార్యక్రమం, బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడపడం ముఖ్యం కాదని.. అప్రమత్తంగా, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నడపడం అవసరమన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, రోడ్డు రవాణా శాఖ జిల్లా అధికారి వెంకట్‌రెడ్డి, ఆర్టిఏ మెంబర్ జాఫర్, ఆర్డీవో వాసుచంద్ర, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment