బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుంది
● రోడ్లు, రైల్వే పనులకు ప్రత్యేక ప్రతిపాదనలు
●ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టే బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేసేలా.. కొత్త పనులు మొదలుపెట్టేలా నిధుల కేటాయింపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్– బీజాపూర్ రోడ్డు విస్తరణ పనులను సత్వరమే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశానన్నారు. లింగంపల్లి నుంచి తాండూరు వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగించడం, కొత్తగా మరో రెండు రైల్వే లైన్ల ఏర్పాటు, రైల్వే గేట్‌తో స్థానికులు పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు 12 ఆర్వోబీలను ఏర్పాటు చేయాలని కోరనున్నారు. శంకర్‌పల్లి నుంచి వయా మోమిన్‌పేట్ మీదుగా మర్పల్లి వరకు, వికారాబాద్–సదాశివపేట్ రహదారుల విస్తరణ చేపట్టాలని, దీనికి సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. శంకర్‌పల్లి సమీపంలో 40 కిలోమీటర్ల పొడవున వినియోగం లేని రైల్వే ట్రాక్‌ను పర్యాటక రంగానికి కేటాయించాలని, ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ అర్బన్, రూరల్ ఏరియాలను కలుపుతూ రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు స్టేషన్లలో వివిధ రైళ్లను నిలపాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్‌గా శంకర్‌నాయక్
ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్‌గా శంకర్‌నాయక్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇంతవరకూ ఈస్థానంలో పనిచేసిన వసంత మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ అవగా.. సచివాలయంలో నీటి పారుదల శాఖ విభాగంలో పనిచేస్తున్న శంకర్‌నాయక్ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్‌ను కలిసిన సిబ్బంది మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం సమీక్షాసమావేశం నిర్వహించారు.
షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా సునీత
షాద్‌నగర్: షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న శుక్రవారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సునీతను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రెండేళ్లుగా ఇక్కడ కమిషనర్‌గా పని చేస్తున్న వెంకన్నను సచివాలయానికి బదిలీపై వెళ్లారు. నారాయణపేట కమిషనర్‌గా పని చేస్తున్న సునీత షాద్‌నగర్‌కు వచ్చారు. ఆమె గతంలో షాద్‌నగర్ మున్సిపాలిటీలో మేనేజర్‌గా విధులు నిర్వహించారు.
ప్రభుత్వం మారినా..
రోడ్లు మారలే
మొయినాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం మారినా రోడ్ల పరిస్థితి మారలేదని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి విమర్శించారు. మొయినాబాద్‌లోని పెద్దమంగళారం– చందానగర్ రోడ్డును శుక్రవారం సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రహదారి పూర్తిగా గుంతలమయమైందన్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్లన్నీ బాగు చేయాలని, లేదంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు రాములు, పాండుగౌడ్, కృష్ణయ్య, హరి, జంగయ్య, రమేశ్, అనురాధ, శ్రీనివాస్, దర్శన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment