ఆశలు ఫలించేనా? | - | Sakshi
Sakshi News home page

ఆశలు ఫలించేనా?

Published Mon, Jan 20 2025 7:09 AM | Last Updated on Mon, Jan 20 2025 7:09 AM

-

హైదరాబాద్‌ పరిధిలో రేషన్‌ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు ఇలా..

సాక్షి, సిటీబ్యూరో: ఈసారైనా ఆహార భద్రత (రేషన్‌) కార్డుల్లో కొత్త సభ్యులకు మోక్షం లభిస్తుందా? ఎనిమిదేళ్లుగా రేషన్‌ కార్డులోని సభ్యులు (యూనిట్లు) వివిధ సాకులతో తొలగింపునకు గురవుతున్నా.. కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ‘మీ సేవ ద్వారా ఈపీడీఎస్‌ ఎఫ్‌ఎస్‌సీ లాగిన్‌లో కొత్త సఽభ్యుల చేర్పుల కోసం చేసుకున్న దరఖాస్తుల దీర్ఘకాలిక పెండెన్సీని సైతం అర్హత ప్రమాణాల ఆధారంగా క్లియర్‌ చేస్తాం’ అని ప్రకటించడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రేపు మాపు అంటూ ఆశలు కల్పించింది. కొత్తగా అధికారంలోకి కాంగ్రెస్‌ కొలువుదీరి ఏడాది గడిచినా యూనిట్ల ఆమోదానికి ఊసే లేకుండా పోయింది. తాజాగా కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులను కూడా పరిశీలించేందుకు సిద్ధమమవుతోంది. వాస్తవంగా పౌర సరఫరాల శాఖ అధికారుల ఈపీడీఎస్‌ ఎఫ్‌ఎస్‌సీ ఆన్‌లైన్‌ లాగిన్‌లో రేషన్‌ కార్డుల్లో పాత సభ్యుల తొలగింపునకు ఆప్షన్‌ ఉన్నప్పటికీ.. కొత్త సభ్యుల దరఖాస్తుల ఆమోదానికి మాత్రం ఆప్షన్‌ లేకుండా పోయింది. దీంతో కొత్తగా వివాహమై అత్త వారింటికి వచ్చిన సభ్యులతో పాటు జన్మించిన కొత్త సభ్యుల చేర్పుల కోసం ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ ఆమోదం మాత్రం సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పడిపోయింది.

మూడు లక్షలపైనే దరఖాస్తులు..

ఎనిమిదేళ్లుగా రేషన్‌ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల ప్రక్రియ పెండింగ్‌లో మగ్గుతోంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో రేషన్‌కార్డులు కలిగిన సుమారు 17,21,603 కుటుంబాలు ఉండగా అందులో 59,00,584 సభ్యులు ఉన్నారు. సుమారు మూడు లక్షల కుటుంబాలు తొమ్మిది లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆన్‌లైన్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం క్షేత్ర స్థాయి విచారణ లేకుండా ఇన్‌స్పెక్టర్ల లాగిన్‌లో 70 శాతానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, విచారణ పూర్తయి ఏఎస్‌వో, తహసీల్‌ లాగిన్‌లో 20 శాతం దరఖాస్తులు, డీఎస్‌వో లాగిన్‌లో 5 శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్‌లైన్‌ నివేదిక స్పష్టం చేస్తోంది.

నిరంతర ప్రక్రియగా దరఖాస్తుల స్వీకరణ..

రేషన్‌ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తూనే.. లాగిన్‌లో ఆమోదించే ఆప్షన్‌ను మాత్రం ప్రభుత్వం నిలిపివేసింది. అయితే.. రేషన్‌ కార్డులోని సభ్యుల తొలగింపు నిరంతర ప్రక్రియగా తయారైంది. పదేళ్లలో రేషన్‌ కార్డులోని సుమారు 34,51,853 మంది లబ్ధిదారులను ఏరివేసిన ప్రభుత్వం.. సుమారు 6.5 లక్షల కొత్త సభ్యుల అమోదాన్ని మాత్రం పెండింగ్‌లో పడేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో సగానికి పైగా సభ్యులు ఏరివేతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డులన్నింటిని రద్దు చేసి వాటిని పూర్తిగా ఆహార భద్రత కార్డులుగా మార్పు చేసింది. పాత కార్డుదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కార్డులు మంజూరు చేసింది. ఆ తర్వాత అనర్హులు, బోగస్‌, టాక్స్‌ పేయర్స్‌, ఇన్‌యాక్టివ్‌ పేరుతో కార్డులు, సభ్యులను ఏరివేస్తూనే వరుసగా రెండేళ్ల పాటు కార్డులో చేర్పులు, మార్పుల ప్రక్రియకు అవకాశం కల్పించి ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తూనే ఆమోదించే లాగిన్‌ను మాత్రం నిలిపి వేసింది. దీంతో దరఖాస్తుల పెండెన్సీ భారీగా పెరిగిపోయింది.

పౌరసరఫరాల కార్డులు కొత్త సభ్యులు

శాఖ సర్కిల్‌

మలక్‌పేట–1 12,805 21,616

యాకుత్‌పురా–2 18,825 33,267

చార్మినార్‌–3 24,129 42,172

నాంపల్లి–4 5,430 8,502

మెహిదీపట్నం–5 17,143 29,499

అంబర్‌పేట–6 9,294 14,493

ఖైరతాబాద్‌–7 15,047 24,330

బేగంపేట్‌–8 10,926 17,840

సికింద్రాబాద్‌–6 8,626 13,452

పెండింగ్‌లో సుమారు 3 లక్షలకుపైగా దరఖాస్తులు

దాదాపు 6.5 లక్షల మందికి పైగా కొత్త సభ్యులు

ఆన్‌లైన్‌లో అర్జీలకు వెసులుబాటు.. ఆమోదం మాత్రం పెండింగ్‌

ఎనిమిదేళ్లుగా అర్జీదారుల ఎదురు చూపులు

పదేళ్లలో రేషన్‌ కార్డుల యూనిట్ల తొలగింపు ఇలా ..

జిల్లా మొత్తం యూనిట్లు ప్రస్తుత యూనిట్లు తొలగించిన యూనిట్లు

హైదరాబాద్‌ 41,40.692 23,61,440 17,79,252

రంగారెడ్డి 27,27,993 18,21,881 9,06,112

మేడ్చల్‌ 24,83,752 17,17,263 7,66,489

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement