జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Published Tue, Jan 21 2025 7:21 AM | Last Updated on Tue, Jan 21 2025 7:21 AM

జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జీపీ వర్కర్స్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి

కేశంపేట: గ్రామ పంచాయతీల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డితో కలిసి జీపీ వర్కర్స్‌ కేలండర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు జీఓ 60ని అమలు చేయాలని కోరారు. మల్టీపర్పస్‌ విధానం రద్దుచేయాలన్నారు. 2011 జనాభా ప్రతిపాదికన పంచాయతీల్లో కార్మికులను నియమించారని, ఆ విధాన్నాన్ని రద్దు చేసి అవసరాలకు అనుగుణంగా కార్మికులను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఎంపీఓ కిష్ట య్య, జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రకాష్‌, కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రయ్య, మండల అధ్యక్షుడు రవి, స్వరూప ఉన్నారు.

భక్తులపై వ్యాపారుల దౌర్జన్యం

సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన వీడియోలు

కొత్తూరు: ప్రఖ్యాతి గాంచిన జేపీదర్గా ఆవరణలో వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం దర్గా దర్శనం కోసం నగరం నుంచి వచ్చిన ఇద్దరు భక్తులపై కొందరు వ్యాపారులు తమ వద్ద పూలు కొనుగోలు చేయాలని దాడికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించిన వివరాలు సీసీ పుటేజీల్లో నిక్షిప్తం అయ్యాయి. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదే విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా.. ఇరువురు భక్తులపై దర్గా ఆవరణలో పూల వ్యాపారం చేసే నలుగురు వ్యక్తులు తమ వద్ద పూలు కొనుగోలు చేయాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని, కర్రలతో కొట్టినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

120 మిల్లీ గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్‌ స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: పూణే నుంచి హైదరాబాద్‌కు వాహనంలో ఎండీఎంఏ క్రిస్టల్స్‌ డ్రగ్స్‌ను తీసుకొని వస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను సంగారెడ్డి, డీటీఎఫ్‌, ఎకై ్సజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ము, కశ్మీర్‌కు చెందిన హర్జత్‌ సింగ్‌(35) అనే వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ డ్రగ్స్‌ వినియోగానికి అలవాటు పడ్డాడు. అతడు తన తోటి ఉద్యోగులకు డ్రగ్స్‌ విక్రయించేవాడు. మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి 120 మీల్లీ గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్‌ డ్రగ్స్‌ను తీసుకొని హైదరాబాద్‌కు వస్తుండగా సంగారెడ్డి డీటీఎఫ్‌, ఎకై ్సజ్‌ పోలీసులు సంగారెడ్డి మల్కాపూర్‌ ప్లైఓవర్‌ తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.21.06 లక్షలు ఉంటుందని అంచనా.

సీఎస్‌ఏఎం కేసుల్లో ముగ్గురి అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: చిన్నారులకు సంబంధించిన చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్డ్‌ మెటీరియల్‌ను (సీఎస్‌ఏఎం) డౌన్‌లోడ్‌ చేసి, చూసి, ఇతరులకు పంపిణీ చేసిన ఆరోపణలపై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు హైదరాబాద్‌కు చెందినవారని డీసీపీ దార కవిత సోమవారం వెల్లడించారు. సీఎస్‌ఏఎంను కనిపెట్టడానికి అంతర్జాతీయంగా ఎన్‌సీఎంఈసీ అనే సంస్థ పనిచేస్తోంది. ఇది ప్రపంచంలో ఎవరైనా ఆయా సోషల్‌ మీడియా వేదికలపై సీఎస్‌ఏఎంను సెర్చ్‌ చేసినా, వీక్షించినా, డౌన్‌లోడ్‌/అప్‌లోడ్‌ చేసినా తక్షణం గుర్తిస్తుంది. భారత్‌కు సంబంధించిన వివరాలను నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్సీఆర్బీ)కు పంపించింది. ఎన్సీఆర్బీ రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీ సీఐడీకి ఈ వివరాలు అందించగా ఆ అధికారులు వినియోగదారుల ఐపీ అడ్రస్‌లను కనుగొన్నారు. ఈ మేరకు వారి నివాస పరిధిలోని సైబర్‌ క్రైమ్‌ ఠాణాల్లో కేసులు నమోదు చేయించారు. ఈవిధంగా ఇటీవల సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. మెదక్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి(35) వివిధ వెబ్‌సైట్ల నుంచి చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ వీడియోలు డౌన్‌లోడ్‌ చేశాడు. వీటిని వీక్షించడంతోపాటు ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా తన స్నేహితులకు పంపాడు. నగరానికి చెందిన ఓ వెల్డర్‌(36) ఇలానే చేసి స్నాప్‌చాట్‌ ద్వారా షేర్‌ చేశాడు. సిటీకే చెందిన మరో విద్యార్థి సైతం ఇలానే చేశాడు. దీంతో ఈ ముగ్గురి వివరాలు సీఐడీ నుంచి పొందిన నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.

రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు

ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... కీసర మండలం బోగారంలోని హోలీమేరీ కళాశాలలో సికింద్రాబాద్‌కు చెందిన చరణ్‌కుమార్‌, కరీంనగర్‌కు చెందిన సూర్యప్రకాశ్‌(17) పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. సోమవారం ఉదయం వారు కళాశాల నుంచి ఘట్‌కేసర్‌ వైపు బైక్‌పై వస్తున్నారు. కొండాపూర్‌ విజ్ఞాన్‌ మహిళా కళాశాల సమీపంలో కీసర వైపు ఘట్‌కేసర్‌కు చెందిన గులాం అహ్మద్‌, చెంగిచెర్లకు చెందిన ప్రహ్లాద్‌ ప్రయాణిస్తున్న బైక్‌ ఎదురుగా వస్తోంది. వేగంగా ఉన్న ఈ రెండు బైక్‌లు ఢీకొనడంతో సూర్యప్రకాశ్‌ తలకు తీవ్రగాయాలుకాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సూర్యప్రకాశ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement