రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
సాక్షి, సిటీబ్యూరో: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని, చివరి లబ్ధిదారు వరకు వాటిని అందిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నగర పరిధిలో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే పురోగతిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి,హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రేషనింగ్ అధికారి, జిల్లా సరఫరా అధికారి, జోనల్ కమిషనర్లతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ వాటిని ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటి స్థలం ఉన్నవారు, లేనివారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల్లేనివారు వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, వీటితోపాటు గతంలో ప్రజాపాలన, సేవాకేంద్రాలు, ప్రజావాణిల్లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులను ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
అవగాహన కల్పించాలి
రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందనే అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ఆదేశించారు. అధికారులందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, అలివేలు మంగతాయారు, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, రవికిరణ్, ఉపేందర్‌రెడ్డి, వెంకన్న, రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment