అధిక లోడు.. ప్రమాదం చూడు
బొంరాస్‌పేట: అధిక లోడుతో వెళ్తున్న వాహనాలతో నిత్యం అవస్థలు పడుతున్నామని మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించి ఇసుక, కంకర, కలప తదితర సామగ్రిని వేసుకొని నిత్యం వందలాది లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో త్వరగా రోడ్డు మరమ్మతులు గురవుతోంది. గుంతలు పడి ప్రయాణానికి ఆటంకం కలిగిస్తోంది. అదుపు చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
లోపించిన పర్యవేక్షణ
మండల పరిధిలోని జాతీయ రహదారిపై గూడ్స్ వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఓవర్ స్పీడ్‌తో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మండలంలోని మెట్లుకుంట శివారు తండాల నుంచి తుంకిమెట్ల, నాగిరెడ్డిపల్లి, రేగడిమైలారం మీదుగా కొడంగల్ వరకు 15 కిలో మీటర్ల దూరం జాతీయ రహదారి 163 ఉంది. దీనిపై మెట్లకుంట చెక్‌పోస్టు వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కాగా చౌదర్‌పల్లి శివారులో రెండు కంకర మిషన్‌లు, దుద్యాల మండల పరిధిలోని ఈర్లపల్లి, గౌరారం శివారులో మరో కంకర మిషన్ ఉంది. ఇక్కడి నుంచి అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. వెనకాల వచ్చే వాహనాలపై దుమ్ము ధూళి పడేసుకుంటూ అవరోధం సృష్టిస్తున్నాయి.
తరచూ ప్రమాదాలు
మహంతీపూర్, మద్దిమడుగుతండా, కొత్తూరు శివారుల్లో నుంచి బొంరాస్‌పేట కాగ్నా వాగు పారుతుండటంతో స్థానికంగా జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇటీవల ఇసుక రవాణాకు అనుమతి లేకుండా పోలీసుల ముందు నుంచే పట్టపగలే ట్రాక్టర్లు ద్వారా తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మండలంలో చెట్లను నరికివేస్తూ జోరుగా అక్రమ కలప రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. దీనిపై సదరు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇలా ఓవర్‌లోడ్, అక్రమ రవాణాలతో అక్రమార్కులు కాసులు దండుకుంటున్నారు. అప్పుడప్పుడు అధికారులు చలాన్లు వేసినా ప్రయోజనం లేకండా పోతోంది. వాహనాల రద్దీతో తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.
పరిమితికి మించిన లోడ్‌తో
లారీల రాకపోకలు
అవస్థలు పడుతున్న వాహనదారులు
పట్టించుకోని అధికార యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment