● బదిలీలు చేయాలనే యోచనలో ఉన్నతాధికారులు ● చెరువుల కబ్జాలకు వంతపాడారని పలువురిపై ఆరోపణలు ● చాలా ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు ● ఇప్పటికే ఈఏ,ఈఈ, ఎస్‌ఈ స్థాయిల్లో బదిలీలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ (డీఈ) ఇంజనీర్ల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. చాలా ఏళ్లుగా ఒకే చోట పాతుకు పోయిన కొందరు అధికారులకు స్థానచలనం కల్పించాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే ఏఈలు, ఈఈల బదిలీలు జరగ్గా డీఈలను మాత్రం ట్రాన్స్‌ఫర్ చేయలేదు. దీంతో త్వరలోనే ఈ క్యాడర్ అధికారులను బదిలీ చేసే యోచనలో ఆ శాఖ ఈఎన్‌సీ ఉన్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోల్, సింగూరు, మునిపల్లి, దౌల్తాబాద్‌లలో ఈడీ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో కూడా డీఈ పోస్టులు ఉన్నాయి. అలాగే నారాయణఖేడ్ డివిజన్‌లో నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, నల్లవాగు, మనూరు, నాగల్‌గిద్దల్లో ఈ పోస్టులు ఉన్నాయి. గత ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో నారాయణఖేడ్ డివిజన్‌లో దాదాపు ప్రతీ మండలానికి ఒక డీఈని నియమించింది. అలాగే జహీరాబాద్ డివిజన్‌లోనూ కూడా డీఈ పోస్టులు ఉన్నాయి.
చెరువుల కబ్జాలు వీరి కనుసన్నల్లోనే..
జిల్లాలో కొందరు డీఈలపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు కబ్జా చేసే వారికి పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బహిరంగంగానే చెరువుల్లో మట్టి నింపి కబ్జాలకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన ఈ అధికారులు కళ్లు మూసుకుని కాసులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. చెరువుల కబ్జాలపై గ్రామస్తులు, స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా కూడా ఈ అధికారులు చర్యలు కూడా తీసుకోలేదు సరికదా..కబ్జాదారుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుని రూ.కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా హెచ్‌ఎండీఏ మండలాల పరిధిలో ఉన్న ఈ డీఈలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించింది. హైడ్రా ద్వారా కబ్జాలను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కబ్జాలకు సహకరించిన కొందరు అధికారులు ఇప్పుడు అక్కడే ఉండటంతో ఈ కబ్జాల తొలగింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బదిలీలు కాని ఈడీలకు స్థానచలనం కల్పించే యోచనలో ఈ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజనీరింగ్ అధికారులందరికీ దాదాపుగా స్థానచలనం కలిగింది. ఆయా మండలాల అసిస్టెంట్ ఇంజనీర్లకు చాలామందిని బదిలీలు చేసింది. కొత్తగా నియామకమైన ఏఈలకు పోస్టింగ్‌లు ఇస్తున్న తరుణంలో చాలామంది ఏఈలు బదిలీల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇలా దరఖాస్తులు పెట్టుకున్న ఏఈలను బదిలీ చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కూడా ప్రభుత్వం మార్చింది. జిల్లాలో అందరు ఈఈలకు బదిలీ జరిగింది. మరోవైపు ఎస్‌ఈలకు కూడా ట్రాన్స్‌ఫర్‌లు అయ్యాయి. ఆయా పోస్టుల్లో గత కొన్ని నెలల క్రితమే కొత్త వాళ్లు చేరారు. కానీ డీఈలకు మాత్రం బదిలీలు జరగలేదు. దీంతో ఇప్పుడు డీఈ క్యాడర్ అధికారులను బదిలీ చేయాలని నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment