నిలోఫర్‌లో శిశువు అపహరణ
● బుర్ఖాలో వచ్చి..ఆటో ఎక్కి పరారీ ● ఇంటికి వెళ్లే సమయంలో ఘటన
నాంపల్లి: నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిలోఫర్ ఆస్పత్రి వద్ద ఓ పసికందు అపహరణకు గురైంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..జహీరాబాద్‌కు చెందిన హసీనాబేగం, గఫార్ దంపతులకు నెల రోజుల క్రితం ఒక మగ శిశువు జన్మించాడు. శిశువుకు పచ్చ కామెర్ల వ్యాధి సోకడంతో బాబును నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. వ్యాధి నుంచి కోలుకున్న శిశువును శనివారం డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయ్యాక శిశువు తల్లి, శిశువు అమ్మమ్మ పైఅంతస్తులోని వార్డు నుంచి కిందకు చేరుకున్నారు. మందులు తీసుకునేందుకు తల్లి కౌంటర్ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో శిశువు అమ్మమ్మ చేతిలో ఉంది. ఇదే సమయంలో బుర్ఖా ధరించిన ఓ మహిళ అక్కడకు చేరుకుంది. తాను ఆస్పత్రి సిబ్బంది అని మాయమాటలు చెప్పి..వృద్ధురాలి చేతిలో ఉన్న శిశువును తీసుకుంది. కాసేపు ఎత్తుకుని మాట్లాడిస్తున్నట్లు నటిస్తూ అక్కడ నుంచి నిష్క్రమించింది. శిశువు ఆచూకీ కోసం ఆస్పత్రి ప్రాంగణమంతా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి శిశువును ఎత్తుకుని బయటకు వెళ్లిన మహిళ బుర్ఖాలో వచ్చినట్లు పోలీసులు సీీసీ ఫుటేజీలో గుర్తించారు. ఆటోలో వెళ్లిన మహిళ కొంతదూరం వెళ్లాక ఆటో దిగి మరో ద్విచక్ర వాహనాన్ని ఎక్కి పారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment