28 నుంచి ఏపీజీవీ సేవలకు బ్రేక్
వినియోగదారులకు బ్యాంకు అధికారుల వెల్లడి
సంగారెడ్డి : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలు మారనున్న నేపథ్యంలో ఈ నెల 28 నుంచి నెలాఖరువరకు బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు బ్యాంకు అధికారులు గురువారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే బ్యాంకు అధికారులు జిల్లాలో ఉన్న ఆయా బ్రాంచ్‌ల వారీగా గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో బ్యాంకు విధి విధానాలను వినియోగదారులకు తెలియజేస్తున్నారు. ఈ బ్యాంకు నుంచి నాలుగు రోజులపాటు యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలగు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు.
ఏదైనా అత్యవసర సమాచారం కోసం సమీప శాఖను వినియోగదారులు సందర్శించవచ్చని సూచించారు. అదేవిధంగా బ్యాంక్ సేవలు, ఖాతాలు ఇప్పటివరకు ఉన్న స్థానాల్లోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. వినియోగదారుల ఖాతా వివరాలు, ఖాతా నంబరు మారవని స్పష్టం చేశారు. వినియోగదారులు ఏపీజీవీబీ యూపీఐ నుంచి డి–రిజిస్టర్ చేసుకుని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో మళ్లీ రిజిస్టర్ అవ్వాలని వివరించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు జారీ చేసిన డెబిట్ కార్డును ఉపయోగించి యూపీఐ కోసం మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించారు. వి– మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ అన్ ఇన్‌స్టాల్ చేసి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్పారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు టీజీబీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకోసం మళ్లీ నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment