కేవల్ కిషన్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు
సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేవల్ కిషన్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని, జీవితాంతం ప్రజల సంక్షేమం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి కేవల్ కిషన్ అని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు పేర్కొన్నారు. కేవల్ కిషన్ వర్థంతి సందర్భంగా గురువారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేకే భవన్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...కేవల్ కిషన్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించిన తొలితరం కమ్యూనిస్టు యోధుడన్నారు. మెదక్ ప్రాంతంలో అనేక గ్రామాలలో పేదలకు భూములు పంచిన నాయకుడని, తనకు వచ్చిన సొంత ఆస్తిలో నుంచి 200 ఎకరాల భూమిని పేదలకు పంచారని గుర్తు చేశారు. కిషన్ భూస్వాములకు వ్యతిరేకంగా పేదలకు భూములు పంచాలని మొట్టమొదట పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ప్రజా పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం మల్లేశం, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment