శ్రీసిద్ధివినాయకున్ని దర్శించుకున్న ఎంపీ
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని రేజింతల్ గ్రామ శివారులో స్వయంభూగా వెలసిన శ్రీసిద్ధివినాయకున్ని శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాగంలో పాల్గొన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, న్యాల్‌కల్ పీఏసీఎస్ చైర్మన్ సిద్దిలింగయ్యస్వామి తదితరులు ఉన్నారు.
గురుకులంలో తాత్కాలిక
అధ్యాపకుల నియామకం
జోగిపేట(అందోల్): అందోలులోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బోధించేందుకు తాత్కాలిక అధ్యాపకుల ఎంపికకు సంబంధించి డెమో నిర్వహించినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ లింగారెడ్డి తెలిపారు. జూనియర్ లెక్చరర్, ఎస్‌జీటీ, టీజీటీలు బాటనీ, ఇంగ్లిష్, తెలుగు, గణితం, బయో సోషల్ సబ్జెక్టులు బోధించేందుకు నిర్వహించిన డెమోలో 41 మంది వరకు పాల్గొన్నారన్నారు. వీరిలో మంచి ప్రావీణ్యత ఉన్నవారిని ఎంపిక చేస్తామన్నారు. శనివారం నుంచి యథావిధిగా తరగతులు కొనసాగుతాయని, అధ్యాపకుల నియామకం కూడా పూర్తవుతుందని చెప్పారు. మొత్తం మహిళా అధ్యాపకులనే ఎంపిక చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అమిత్‌షా బహిరంగ
క్షమాపణ చెప్పాలి
తూప్రాన్: పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగా క్షమాపణలు చెప్పాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ల రవిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రహదారిపై అమిత్‌షా చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా దేశంలో అట్టడుగువర్గాల ప్రజలందరికీ న్యాయం జరిగిందన్నారు. అమిత్‌షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో జిల్లా ఇన్‌చార్జి సుమన్, నాయకులు సుధాకర్ యాదవ్, నరేష్, లక్ష్మణ్, రమేష్, చంద్రమౌళి, చంద్రమౌళి యాదవ్, దీపిక తదితరులు పాల్గొన్నారు.
వారిని ప్రభుత్వ పరంగా
ఆదుకుంటాం
కొల్చారం(నర్సాపూర్): కిష్టాపూర్‌లో విద్యుత్‌షాక్‌తో మృతిచెందిన నవీన్, ప్రసాద్ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శుక్రవారం పరామర్శించారు. తనవంతుగా ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి కొల్చారం చేరుకొని ఎస్‌ఐ సాయికమార్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నాయకులు శంకర్, శ్రీశైలం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment