![సూర్యనమస్కారాలు 4,02,154](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09sdp134-603315_mr-1739152208-0.jpg.webp?itok=PmjFYT3E)
సూర్యనమస్కారాలు 4,02,154
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సూర్యనమస్కారాలు అట్టహాసంగా జరిగాయి. ఏకంగా 4,02,154 సూర్య నమస్కారాలు చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. జిల్లా యోగా సన స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో శత సహస్ర సూర్య నమస్కారాలు జరిగాయి. అలాగే రాష్ట్ర స్థాయి సూర్య నమస్కారాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 20 జిల్లాల నుంచి 1,484 మంది సాధకులు పాల్గొన్నారు. 25 ఏళ్ల లోపు, 25 ఏళ్లు పైబడిన వారికి వేరువేరుగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు జరిగాయి. నాలుగు విభాగాల్లో జరిగిన పోటీల్లో ఐదేళ్ల నుంచి 72 ఏళ్ల వయసు ఉన్న వారు పాల్గొని ఉత్తేజాన్ని నింపారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు, యోగసాధకులకు అతిథులు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. పోటీలను సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment