సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ ద్వారా మైనార్టీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్‌లను అందించనున్నట్లు జిల్లా మైనార్టీస్ శాఖ అధికారి షేక్ ఆహ్మద్ బుధవారం తెలిపారు. జిల్లాలోని ముస్లిం, సిక్కులు, బుద్దిస్ట్, జైన్స్, పార్సిస్‌కు చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై తెల్లరేషన్‌కార్డు ఉండి, వార్షిక ఆదాయం రూ. లక్షా యాభై వేలకు మించకుండా ఉండాలని తెలిపారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వారైతే రూ. 2 లక్షల ఆదాయం మించకుండా ఉండాలని సూచించారు. 18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని తెలిపారు. టైలరింగ్ కోర్సు నేర్చుకుని సర్టిఫికెట్ కలిగి ఉండి, కనీసం 5వ తరగతి పాసై ఉండాలని పేర్కొన్నారు. 5 సంవత్సరాల నుంచి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి లబ్ధి పొంది ఉండరాదని సూచించారు. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు అనంతరం హార్డ్ కాపీని జిల్లా మైనార్టీ శాఖ కార్యాలయంలో అందించాలని తెలిపారు. నిరుద్యోగ నిరుపేద మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు, అనాధ, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment