నేత్రపర్వంగా లక్ష పుష్పార్చన
నాచగిరిలో భక్తిపారవశ్యం
వర్గల్(గజ్వేల్): ధనుర్మాస వేళ భక్తజన లక్ష పుష్పార్చనతో నాచగిరి శోభిల్లింది. పూలు, ఫలాల మధ్య లక్ష్మీనృసింహస్వామివారు భక్తజనులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఆలయ ముఖమండపంలో కొనసాగిన విశేష పుష్పార్చన ఆద్యంతం నేత్రపర్వం చేసింది. అర్చక బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణ, భక్తులు శ్రీనృసింహస్వామివారి నామం పఠిస్తూ ఒక్కొక్కటిగా మల్లె, జాజి, సంపెంగ, గులాబి తదితర పూలు, వివిధ ఫలాలు సమర్పించారు. ఆలయ ఈఓ అన్నపూర్ణ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.
పెరియార్ రామస్వామికి నివాళులు
గజ్వేల్: సంఘ సంస్కర్త పెరియార్ రామస్వామి వర్ధంతి సందర్భంగా మంగళవారం డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆ మహనీయుడి చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు, మంజీర దళిత సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కిరణ్, దళిత సంఘాల నాయకులు బాల్‌నర్సయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మా భూములు మాకు కావాలే
ఐఓసీ ఎదుట ట్రిపుల్‌ఆర్ బాధితుల నిరసన
గజ్వేల్: ‘ట్రిపుల్‌ఆర్ వద్దు.. మా భూములు మాకే కావాలే.. ’ అంటూ వర్గల్ మండలం సామలపల్లికి చెందిన భూ బాధితులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం గజ్వేల్‌లోని ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) ఎదుట నిరసన తెలిపారు. భూములు బలవంతంగా లాక్కొంటే జీవనాధారం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు పహారాలో భూములను సర్వే చేస్తూ... స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించా రు. ఈ ప్రయత్నాలను అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
నాణ్యమైన విత్తనాలే అందించాలి
సిద్దిపేటఅర్బన్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా డీలర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి రాధిక సూచించారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎరువులు, విత్తనాల షాపులను ఆమె సందర్శించి స్టాక్ రిజిష్టర్, ధరల పట్టిక, విత్తనాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగి సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి కృత్రిమ కొరత సృష్టించకుండా రైతులకు సహకరించాలని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అర్బన్ మండల ఏఓ శ్రీనాథ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment