ఉద్యాన పంటల విస్తరణకు కృషి
● కొత్త పంట రకాల పరిచయం.. ● తెగుళ్ల నియంత్రణకు చర్యలు ● హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి ● ఘనంగా యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం
గజ్వేల్: ఉద్యాన పంటల విస్తరణకు హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విశేష కృషిని కొనసాగిస్తున్నట్లు ములుగు కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి అన్నారు. యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉద్యాన రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. వ్యవసాయ స్థూల విలువ ఉత్పత్తి 30శాతంగా ఉండడానికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో కొత్త సిలబస్‌ను అమలు చేయడం, స్మార్ట్ క్లాసుల అభివృద్ధి, అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ సంస్థల సహకారంతో కీలక విజయాలు సాధించినట్లు తెలిపారు. పరిశోధనల్లోనూ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ తనదైన ముద్రను వేసుకున్నదని చెప్పారు. కొత్త పంట రకాలను, తెగుళ్ల నియంత్రణ, గ్రామీణ యువతకు నైపుణ్యం ఆధారిత శిక్షణను అందించగలిగామని అన్నారు. యూనివర్సిటీ పనితీరుకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌కే మాథూర్ మాట్లాడుతూ హార్టికల్చర్ యూనివర్సిటీ కార్యకలాపాలను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఏ. భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ ఎం. రాజశేఖర్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డీ. లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ డాక్టర్ విజయ, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శ్రీనివాసన్, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment