అందరికీ కరుణామయుడే..
● ప్రేమ, ఆరాధనల సమాహారమే క్రిస్మస్ ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: ఏసు ప్రభువు అందరికీ కరుణామయుడేనని, ఏసును ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం పట్టణంలో నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని కేటాయిస్తామని, వెంటనే స్థల సేకరణ చేపట్టాలని ఆర్డీఓను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుందన్నారు. వచ్చే నాలుగేళ్లు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, మరిన్నీ కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆశీర్వదించాలని కోరారు. అందరూ మానవీయ విలువలతో, ప్రేమ, ఆప్యాయతలతో కలిసి మెలసి జీవించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, వివిధ మండలాల పాస్టర్లు పాల్గొన్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
హుస్నాబాద్‌రూరల్: గురుకుల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం జిల్లెలగడ్డలోని గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు అందించే తాగునీటి వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు. నిత్యం క్లినింగ్ చేసి తాగునీరు అందించాలని అదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని, పోషకాలు ఉండే ఆహారం అందించాలన్నారు. పాఠశాల ఆవరణలో చెత్తను క్లీన్ చేసి జామ, మామిడి, మునుగ, కూరగాయల మొక్కలను పెంచి ఉద్యాన వనంలా తయారు చేయాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు చదువుల కోసం గురుకులాలకు పంపించారని, వారిని ఉత్తములుగా తీర్చిదిద్ది తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment