కదంతొక్కిన కాషాయ దండు
బుధవారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాషాయ దండు కదం తొక్కింది. జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. 3వేల మందికి పైగా కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలలో భాగంగా మంగళవారం రెండో రోజు పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి వీరసావర్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో అంబేడ్కర్, గాంధీ, శివాజీ, వీరసావర్కర్‌ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. కళాకారులు డోలు విన్యాసాలు, బోనాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దేశ నిర్మాణంలో కీలక పాత్ర
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్‌బీరాజ్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఏబీవీపీది కీలక పాత్ర అన్నారు. అర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిరం, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, నూతన విద్యావిధానం, వీటి అమలుకు ఏబీవీపీ చేసిన కృషి ఫలించిందన్నారు. నీళ్లు, నిధులు నియామకాల పేరుతో పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పదేళ్లు రాక్షస పాలన నడిచిందన్నారు. ఇప్పుడు రేవంత్ పాలనలోనూ అవి దక్కడం లేదని విమర్శించారు. ఏబీవీపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. వీర మరణం పొందిన ఏబీవీపీ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేవలం ఐదుగురితో ప్రారంభించిన ఏబీవీపీ నేడు 55 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్న అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఆవిర్భవించిందన్నారు. ఏబీవీపీ అంబేడ్కర్‌ను గుండెల్లో పెట్టుకుంటోందన్నారు. నేడు పార్లమెంట్ హాల్‌లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టింది బీజేపీయేనని అన్నారు. జిల్లాలోని వీరభైరాన్ పల్లి, కూటిగల్ ప్రజల పోరాటాలు స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. ఆయా గ్రామ ప్రజలను ఆదర్శంగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని శ్రవణ్‌రాజ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, కార్యదర్శి రాంబాబు, నేషనల్ వర్కింగ్ మెంబర్ ఝాన్సీ, పృథ్వీ, రాకేశ్, శ్రీనివాస్, చత్రపతి చౌహన్, వివేక్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోఏబీవీపీ కార్యకర్తల భారీ ర్యాలీ
కొనసాగుతున్న రాష్ట్ర మహాసభలు
Comments
Please login to add a commentAdd a comment