పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు తప్పనిసరి
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనూజ
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని పౌరసరఫరాల శాఖ అధికారి తనూజ పెట్రోల్ బంక్ డీలర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో తనూజ పెట్రోల్ బంక్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారుల కోసం రక్షత మంచినీరు, ఉచిత ఎయిర్ సేవలు, మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రదేశం వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. ఆదేశాలను పాటించకుంటే ఆ డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది, బంకుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
పశువులకు
టీకాలు వేయించండి
పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట్‌రెడ్డి
మద్దూరు(హుస్నాబాద్): పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మర్మాముల గ్రామ పరిధిలోని బంజారాలో పశువులకు కృత్రిమ గర్భాధరణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటికే సీజనల్ వ్యాధులకు టీకాలు వేస్తున్నామన్నారు. అలాగే గర్భకోశ వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు సిబ్బంది పరువయ్య తదితరులు పాల్గొన్నారు.
కుట్రపూరిత రాజకీయాలే..
ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు
గజ్వేల్: ఫార్ములా ఈ రేస్‌తో నగర ఇమేజీని విశ్వవ్యాప్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌పై అక్రమ కేసు సహించరానిదని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలపై గట్టిగా నిలదీస్తున్నందువల్లే ప్రభుత్వం బీఆర్‌ఎస్ గొంతు నొక్కాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, జగదేవ్‌పూర్ సహకార సంఘం చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ పాఠశాలగా
‘ఇందిరానగర్’
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేట పట్టణం ఇందిరానగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తమంగా ఎంపికైందని అర్బన్ మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. హైబీచ్ టీవీ సంస్థ ఉన్నత పాఠశాలగా ఎంపికచేసిందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో శాంతాబయోటిక్స్ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, మల్లారెడ్డి కళాశాల వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ల చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారని తెలిపారు. ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment