పాండ్యాతో కోహ్లి
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్‌లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.
ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్‌మెంట్‌కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్‌నెస్, వికెట్ కీపర్ ఎంపిక గురించి మేనేజ్‌మెంట్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
పాండ్యా గనుక బౌలింగ్ చేస్తే అదనపు పేసర్ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్‌నెస్ దృష్ట్యా బౌలర్‌గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పోటీపడుతున్నారు.
వీరిలో సంజూ ఐపీఎల్-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్ కలవరపెడుతోంది.
అతడిపై వేటు తప్పదా?
మరోవైపు.. ఓపెనింగ్ స్లాట్‌లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్‌మెంట్ మాత్రం ఈ విషయంలో జైస్వాల్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది.
Comments
Please login to add a commentAdd a comment