తరం మారింది. వేదికలు మారాయి. ఇరు జట్లలో ఆటగాళ్లూ మారారు. కానీ అభిమానుల భావోద్వేగాలు మాత్రం మారలేదు. ‘ఈ మ్యాచ్’పై ఉండే ఆసక్తి, ఆకర్షణ, అంచనాలు అలాంటివి మరి! ఒక సాధారణ పోరులాగే చూస్తామని ఎంత చెప్పుకున్నా... ప్లేయర్లకూ తెలుసు తమపై ఉండే ఒత్తిడి గురించి. షెడ్యూల్‌లో ఎలాగైనా ఈ మ్యాచ్‌ను చేర్చి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కాసుల పంట పండించుకోవాలని చూస్తే... ప్రసారకర్తలు ‘మౌకా మౌకా’ ప్రకటనలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తారు.
అవును, భారత్, పాకిస్తాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్ మళ్లీ వచ్చేసింది. క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరంతో దాయాది జట్లు తమ టి20 వరల్డ్‌కప్ వేటను మొదలు పెట్టబోతున్నాయి. ఎన్ని మారినా ఇరు జట్ల మధ్య సమరాల్లో తుది ఫలితం మాత్రం మారలేదు. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఐదుసార్లు తలపడగా ప్రతీసారి భారత్‌నే విజయం వరించింది. వన్డే వరల్డ్‌కప్‌ను కూడా కలుపుకుంటే 12–0తో టీమిండియా తిరుగులేని ప్రదర్శన కనబర్చింది.
గత కొంత కాలంగా టీమ్ ఫామ్, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే కచ్చితంగా మనదే పైచేయిగా కనిపిస్తోంది. ఇటీవల ఐపీఎల్ ఆడిన అనుభవంతో యూఏఈ పిచ్‌లపై కూడా అంచనా రావడం మరో సానుకూలాంశం. ‘సొంతగడ్డ’లాంటి వేదికపై ఆడుతున్న పాక్ పని పట్టి స్కోరును 13–0గా మార్చాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటుండగా... ధనాధన్ ప్రదర్శనతో ‘సూపర్ సన్‌డే’ అందరికీ ‘ఫన్‌డే’ కానుంది.
T20 World Cup 2021 India Vs Pakistan: రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్ లో తలపడిన తర్వాత భారత్, పాకిస్తాన్ జట్లు అంతర్జాతీయ వేదికపై మరో సమరానికి సన్నద్ధమయ్యాయి. టి20 ప్రపంచకప్ గ్రూప్–2లో భాగంగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు సుదీర్ఘ కాలంగా ఆగిపోయిన నేపథ్యంలో భారత్, పాక్ ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతుండటంతో ఎప్పటిలాగే మ్యాచ్‌పై అన్ని వైపుల నుంచి అమిత ఆసక్తి నెలకొంది. టోర్నీలో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉండటంతో హోరాహోరీ పోరుకు అవకాశం కనిపిస్తోంది.
అశ్విన్‌కు అవకాశం ఉందా!
ఐపీఎల్ కారణంగా భారత జట్టు సభ్యులకు యూఏఈలో మంచి ప్రాక్టీస్ లభించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌తో పాటు రోహిత్ శర్మ ఇచ్చే ఆరంభంతో భారత్‌కు మంచి పునాది ఖాయం. ఇటీవల చెప్పుకోదగ్గ రీతిలో రాణించకపోయినా... కోహ్లిలాంటి టాప్ ఆటగాడు మళ్లీ తన సత్తా చాటేందుకు ఇదే సరైన సమయం. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ దూకుడును కొనసాగించగలరు. బౌలింగ్ చేయకపోయినా హార్దిక్ పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా కూడా జట్టులో ఉండగలడని కోహ్లి స్పష్టం చేయడంతో అతని స్థానం కూడా ఖాయమైనట్లే.
నిజానికి బ్యాటింగ్‌లో కూడా అతని ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. ఐపీఎల్‌లో 11 ఇన్నింగ్స్‌లలో కలిపి హార్దిక్ 127 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చివర్లో అతని పవర్ హిట్టింగ్ ఒక్కసారిగా మ్యాచ్ రాత మార్చగలదని టీమ్ మేనేజ్‌మెంట్ నమ్ముతోంది. ఆల్‌రౌండర్‌గా జడేజా విలువైన పాత్ర పోషించగలడు. పిచ్‌ను బట్టి బౌలింగ్ బృందంలో మార్పులు ఉండవచ్చు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లతో (అదనంగా జడేజా) జట్టు ఆడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడి ప్రతీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు ఖాయం కాగా... అనుభవవజ్ఞుడైన అశ్విన్, లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్‌లలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. బుమ్రా, షమీలతో పాటు భువనేశ్వర్‌కు తొలి మ్యాచ్‌లో చాన్స్ దక్కవచ్చు. శార్దుల్‌కు బ్యాటింగ్ సామర్థ్యం ఉన్నా ... టి20 మ్యాచ్‌లో ఏడో స్థానంలో ఆడే జడేజా వరకు మనకు నాణ్యమైన లైనప్ ఉంది కాబట్టి సమస్య లేదు.
మాలిక్ లేదా హఫీజ్...
మ్యాచ్‌కు ముందు రోజే పాకిస్తాన్ 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. వీరిలో ముగ్గురు రెగ్యులర్ పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. షాహిన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రవూఫ్‌లకు మెరుగైన రికార్డే ఉన్నా భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడం వారికి అంత సులువు కాదు. లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ ఇమాద్, లెగ్‌స్పిన్నర్ షాదాబ్‌లు యూఈఏ పిచ్‌లపై గతంలో పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడారు కాబట్టి వారి స్పిన్ ప్రభావవంతంగా ఉండవచ్చు.
బ్యాటింగ్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్, రిజ్వాన్‌ల బ్యాటింగ్‌పైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరి భాగస్వామ్యాలే ఇటీవల పాక్‌కు వరుస విజయాలు అందించాయి. నిలకడకు బాబర్ మారుపేరు కాగా, మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న రిజ్వాన్ 2021లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
14 ఇన్నింగ్స్‌లలో అతను 140 స్ట్రయిక్‌రేట్‌తో 752 పరుగులు చేయడం విశేషం. ఫఖర్ జమాన్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉండగా... ఆసిఫ్, హైదర్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. సీనియర్లు షోయబ్ మాలిక్, హఫీజ్ మధ్య పోటీ నెలకొంది. దాదాపు ఒకే తరహా బ్యాటింగ్, బౌలింగ్ శైలి ఉన్న వీరిద్దరిలో ఒకరికే తుది జట్టులో చోటు లభించవచ్చు.
పిచ్, వాతావరణం
ఐపీఎల్ తర్వాత దుబాయ్ పిచ్‌లు నెమ్మదించాయి. స్పిన్ బౌలర్లు ప్రభావం చూపే అవకాశం ఎక్కువ. పేసర్లు కూడా స్లో బంతులతోనే ఫలితం రాబట్టగలరు. రాత్రి మంచు ప్రభావం ఎక్కువ కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కే మొగ్గు చూపవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, షమీ, బుమ్రా, రాహుల్ చహర్/అశ్విన్.
పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఆసిఫ్, ఫఖర్ జమాన్, హైదర్, మొహమ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీమ్, మొహమ్మద్ హఫీజ్/షోయబ్ మాలిక్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహిన్ షా అఫ్రిది.
చదవండి: Adil Rashid: టి20 ప్రపంచకప్‌లో ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు
Comments
Please login to add a commentAdd a comment