సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకుని రానున్న ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కాగా జనసేన నేతలు మాత్రం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ స్థానాన్ని వదులుకుంటే ‘గ్లాసు’ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తానని ప్రకటించినట్లు ప్రచారం ఉంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు కుంపటి రగులుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారు కావడంతో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో నూతన జిల్లాలో జనసేన పార్టీ స్థానం ఎక్కడనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన మాత్రం నెల్లూరు నగర నియోజకవర్గం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా నారాయణకు ఎసరు పెట్టే అవకాశం ఉండడంతో సీటు కోసం గ్లాసుకు ఖరీదు కట్టినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నెల్లూరు నగర సీటు వదులుకుంటే జనసేనకు బంపర్ ఆఫర్ ఇస్తానని ప్యాకేజీ ప్రకటించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
‘ఉనికి’పాట్లు
ప్రస్తుతం జిల్లాలో అటు తెలుగుదేశం, ఇటు జనసేన పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఆ రెండు పార్టీలకు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ప్రజల మద్దతు లేకపోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య కుదిరిన పొత్తు ద్వారా బలం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే ఈ రెండు పార్టీల పొత్తు జిల్లాలో వికటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఏ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయిస్తారనే అంశంపై స్పష్టత లేనప్పటికీ జిల్లాలో జనసేనకు సీటు కావాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం.
సీటు వదులుకుంటే బంపర్ ఆఫర్
ప్రస్తుతం జనసేన నేతలు నెల్లూరు నగర నియోజకవర్గం సీటు కావాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం ఉండగా, నాదెండ్ల మనోహర్ ద్వారా నగర సీటు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నెల్లూరు నగర సీటు జనసేనకు కేటాయించే పరిస్థితి వస్తే మాజీ మంత్రి నారాయణను ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే నెల్లూరు నగర నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూ ప్రకటించుకున్న నారాయణ తన సొంత ఎన్నికల టీంను రంగంలోకి దింపి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఉన్న పళంగా సీటు జనసేనకు కేటాయిస్తే తన పరువు పోతుందని భావించి జనసేనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం ఉంది.
జిల్లాలో నెల్లూరు నగర సీటు తప్పించి ఏ సీటు అడిగినా టీడీపీ అధినేత చంద్రబాబును ఒప్పించడమే కాకుండా జనసేన అభ్యర్థికి అయ్యే ఎన్నికల ఖర్చు మొత్తం తానే చూసుకుంటాననడంతోపాటు జనసేన నేతలకు మరో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఆఫర్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో జనసేన నేతలు ప్యాకేజీ ఆఫర్‌తో పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. నెల్లూరు నగరం సీటు కాకుంటే నెల్లూరు రూరల్ సీటుపై దృష్టిపెడుతున్నట్లు కూడా మరో ప్రచారం ఉంది. నెల్లూరు రూరల్ సీటు ఆశిస్తే తప్పక టీడీపీ అధినేతను ఒప్పించి, ఎన్నికల ఖర్చు, ప్యాకేజీ కూడా ఇప్పించేందుకు మాజీ మంత్రి నారాయణ తెర వెనుక ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం ఉంది. మరి జనసేనకు ప్యాకేజీ ఆఫర్ ఎంత మేర పనిచేస్తుందో వేచి చూడాలి.
జిల్లాల పునర్విభజన తరువాత జిల్లా 8 (నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, ఉదయగిరి, కావలి, కందుకూరు) నియోజకవర్గాలకు పరిమితమైంది. ఈ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు పెద్దగా ఆదరణ లేదు. పైగా ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా ప్రస్తుతం లేరు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మనుక్రాంత్‌రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్‌తో ఉన్న అనుబంధం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో టీడీపీ పొత్తుతో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మనుక్రాంత్‌రెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment