మాట్లాడుతున్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నిరుద్యోగ రహిత నెల్లూరే తన లక్ష్యమని, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఆరు నెలలకోసారి దేశంలోని ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి జాబ్ మేళాలు నిర్వహిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. నగరంలోని రామ్మూర్తినగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వారానికోసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా ప్రజాదర్బార్‌కు వచ్చి వినతులు ఇవ్వవచ్చని తెలిపారు. ముఖాముఖిలో యువత ప్రశ్నలకు జవాబిస్తూ నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించామని, అందులోని వాగ్దానాలను వంద శాతం నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరులో ఐటీ సెజ్, ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరు ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఎంపీ అభ్యర్థిగా తనను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పంపించడం తన అదృష్టమన్నారు. దేశ ఉత్పాదకత పెంచే బాధ్యత యువతపై ఉందన్నారు. దేశాభివృద్ధికి, దేశాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కేవలం 34,108 ఉద్యోగాలు మాత్రమే కల్పించగా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక 2,22,000 శాశ్వత ఉద్యోగాలు కల్పించారని వివరించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దాన్ని యువత తిప్పికొట్టాలన్నారు. ఏపీ క్రికెట్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్సార్ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన సేవలు ఎవ్వరూ మర్చిపోలేరన్నారు. 30 వేల మందికి నిత్యావసర వస్తువులు అందించారన్నారు. 300 బెడ్లతో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. హనీ గ్రూప్ అధినేత ఓబుల్‌రెడ్డి, యువత తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఆరు నెలలకోసారి
జాబ్ మేళాలు నిర్వహిస్తాం
ప్రజాసమస్యల పరిష్కారానికి
ప్రజాదర్బార్
వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి
విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment