4 లక్షల మందికి ‘ఉచిత గ్యాస్’
నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలో అర్హులైన 4,06,522 మందికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ నవంబర్ 1 నుంచి ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ ఓ ఆనంద్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్‌లో కలెక్టర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లబ్ధిదారులకు ప్రతి నాలుగు నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తుందన్నారు. నవంబర్ నుంచి మార్చిలోపు మొదటి సిలిండర్ పొందవచ్చునని, సిలిండర్ పొందిన 48 గంటల్లో లబ్ధిదారులకు సబ్సిడీ డీబీటీ ద్వారా ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందన్నారు. నవంబర్ 1వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో రెండోది, ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యలో మూడో సిలిండర్ పొందవచ్చునన్నారు. జిల్లాలో దీపం పథకం కనెక్షన్లు 2,33,398, ఉజ్వల పథకం కనెక్షన్లు 24,318, సీఎస్‌ఆర్ కనెక్షన్లు 1,00,208 ఉండగా, మిగిలిన వారు తెల్లకార్డు కలిగి ఉన్నారని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఏ విధమైన దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ గ్యాస్ బుకింగ్ లాగా చేసుకోవాలన్నారు. క్రీయాశీలకంగా ఉన్న ఎల్‌పీజీ కనెక్షన్లు, ఆధార్ నంబర్ల అనుసంధానం, తెల్లరేషన్ కార్డు, ఇతర శాఖల డేటాబెస్‌తో సరిపోలిన ఎల్‌పీజీ కనెక్షన్ వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ వెంకటరమణ పాల్గొన్నారు.
ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్
నవంబర్ నుంచి మార్చి మధ్యలో మొదటిది
Comments
Please login to add a commentAdd a comment