నిఘా నేత్రంపై నిర్లక్ష్యం
నేరాల నియంత్రణ, నేరస్తుల జాడ పట్టించడంలో కీలకమైన నిఘా నేత్రంపై పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిఘాను అనుక్షణం పర్యవేక్షించేందుకు రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనం.. ఆతిథ్య మందిరంగా మిగిలిపోయింది. జిల్లా కేంద్రం నెల్లూరు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం కావలి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉండడం, వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా ప్రసిద్ధి గాంచింది. విద్యారంగంలో విశిష్ట స్థానం సంతరించుకుంది. ఎన్నో ప్రాధాన్యతలు గల పట్టణానికి దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి వారో వస్తూ పోతుంటారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన పట్టణంలో పోలీస్‌శాఖ నిఘా వ్యవస్థ లేకపోవడం నేరాలకు అడ్డాగా మారుతోంది. ప్రజల ఆస్తులకు భద్రత కొరవడుతోంది.
కావలి: కావలి పట్టణంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు బస్టాండ్, రైల్వేస్టేషన్, శివారు ప్రాంతాలు, ఇతర కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు నెలల తరబడి పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాదిన్నర నుంచి జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలోనూ పోలీసు యంత్రాంగం నిఘా కెమెరాలపై దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉంది. పట్టణ ప్రధాన కూడళ్లు, ట్రంక్‌రోడ్డులో ఉన్న కెమెరాలు చూపుడుకే తప్ప ఎందుకూ పనికి రావడం లేదు. చివరకు వ్యాపార సంస్థలు, ఇళ్ల యజమానులు ఏర్పాటు చేసుకున్న లో రిజల్యూషన్ కెమెరాలపై ఆధారపడాల్సి వస్తుంది.
ప్రయోగాత్మక దశలోనే నిర్వీర్యం
కావలి పట్టణంలో పోలీసులు పకడ్బందీగా భద్రత చర్యలు తీసుకోవడానికి కొంత మేరకు హంగులు సమకూర్చుకొన్నప్పటికీ, అవి అమలుకు నోచుకోలేదు. అన్నింటా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సంతరించుకొంటున్న ఈ ఆధునిక కాలంలో, పోలీసులు కూడా తమ విధులకు ఆధునికతను జత చేసుకొంటున్నాయి. అందులో భాగంగానే కావలి పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి పోలీసు అధికారులు చొరవ తీసుకొని, పట్టణంలోని ముఖ్యమైన కూడలిలో కనీసం వంద చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రయోగాత్మకంగా 14 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిలో రికార్డయ్యే వీడియో ఫుటేజీలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ విజయవంతం అయితే ఈ సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా సీసీ కెమెరాల నుంచి వచ్చే వీడియో ఫుటేజీలను రోజులో 24 గంటలు పాటు పర్యవేక్షించడానికి, వీడియోలను భద్రపరచడానికి కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణాన్ని నిర్మించారు. పట్టణంలో ఆ శాఖకు చెందిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. నేరాలు జరిగినప్పుడు మాత్రం వ్యాపార సంస్థలకు చెందిన సముదాయాలు వద్ద ప్రైవేట్ సీసీ కెమెరాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఏడాది కాలంగా నేరాల క్లూస్ దొరకని వైనం
కావలి పట్టణంలో పోలీసు వ్యవస్థ నామమాత్రంగా మారడం, నిఘా కెమెరాలు నిస్తేజం కావడంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. గతేడాది బృందావనం కాలనీలో సుమారు రూ.కోటి విలువైన చోరీ జరిగిన తర్వాత నుంచి వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు అరికట్టలేకపోతున్నారు. నేరాల ఛేదనలోనూ తీవ్రంగా విఫలమవుతున్నారు. బృందావనం కాలనీ ఘటనలో ఇప్పటి వరకూ కనీసం అనుమానితుల ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత వరుసగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల్లోనూ దొంగతనాలు జరిగినా పోలీసులు ఒక్క ఘటనలో కూడా ఆధారాలు సేకరించలేకపోయారు. ఈ ఏడాది ముసునూరు సమీపంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడిన ఘటనలో దర్యాప్తు కూడా మూలన పడింది. వీటితో పాటు ద్విచక్ర వాహనాలకు సంబంధించిన చోరీలు పదుల సంఖ్యలో చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ బంగారు వ్యాపారికి సంబంధించిన కారు అద్దాలు పగులగొట్టి సుమారు రూ.10 లక్షలు చోరీ చేశారు. ఈ కేసులో కూడా ఇప్పటి వరకూ చిన్న క్లూ కూడా లభించలేదు. వీటిలో కనీసం పది శాతం దొంగతనాల్లో కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. అంతకు ముందు పట్టణంలో తీవ్ర సంచలనంగా మారిన గుర్తుతెలియని మహిళ హత్య కేసు ఇప్పటి వరకూ వీడలేదు. కావలి శివార్లలో మహిళను చంపి తగులబెట్టినా పోలీసులు కనీసం మృతురాలు ఎవరనేది కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్న కొన్ని కూడా పనిచేయకపోవడంతో పదుల సంఖ్యలో కేసులకు సంబంధించి చిన్నపాటి ‘క్లూ’స్ దొరకలేదంటే పట్టణంలో నిఘా వ్యవస్థ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సీసీ కెమెరాల ఆవశ్యకతను చెప్పిన ‘చిన్నారి కిడ్నాప్’
ఈ నెల 28న కావలిలో సంచనలం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ ఉదంతం పట్టణంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను చాటి చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి సమీపంలో ఓ ఇంటి యజమాని ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరానే పోలీసుల దర్యాప్తునకు ఆధారంగా మారింది. పట్టణంలోని నిఘా కెమెరాలను పర్యవేక్షించేందుకు లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ పోలీసు అతిథి గృహంగా మారిపోయింది. శాంతిభద్రతల పరంగా సున్నితంగా, వస్త్ర వ్యాపారంలో రెండో ముంబయిగా ప్రసిద్ధి చెందిన కావలిలో నేర నియంత్రణలో కీలకమైన నిఘా కెమెరాలు పనిచేయకపోవడం, పోలీసు వ్యవస్థ నామమాత్రంగా ఉండడం పట్టణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది.
పట్టణంలో పనిచేయని సర్వైలెన్స్
సీసీ కెమెరాలు
వరుస ఘటనల నేపథ్యంలోనూ
స్పందించని పోలీసు యంత్రాంగం
సీసీ కెమెరాల ఆవశ్యకతను స్పష్టం చేసిన చిన్నారి కిడ్నాప్ ఉదంతం
Comments
Please login to add a commentAdd a comment