ఇసుక టెండర్ల ప్రక్రియకు హైకోర్టు బ్రేక్
● మధ్యంతర ఉత్తర్వులు జారీ
నెల్లూరు (సెంట్రల్): ఇసుక టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలంటూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం దక్కించుకున్న టెండర్లు కాదని, మరొక సారి టెండర్లకు వెళ్లిన జిల్లా మైనింగ్ శాఖ తీరును హైకోర్టు తప్పు పట్టింది. వివరాల్లోకి వెళితే ఇటీవల జిల్లాలోని పల్లిపాడు, మినగల్లు, ఇరువూరు, పీకేపాడు ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఇసుకను తరలించే విధంగా ఈ నెల 16వ తేదీ వరకు టెండర్లు ఆహ్వానించారు. అయితే టీడీపీకి చెందిన కొందరు ఇసుక తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో 69 శాతం లెస్‌తో టెండర్లు దాఖలు చేశారు. ఇలాంటి టెండర్లకు అనుమతి ఇస్తే అక్రమాలకు ఆమోదం తెలిపినట్లేనని కలెక్టర్ భావించి లాటరీ విధానంలో ఈ నెల 17వ తేదీన నలుగురిని ఎంపిక చేశారు. దీంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి రాలేదని మరుసటి రోజే టెండర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై టెండర్లు దక్కించుకున్న వాళ్లు కోర్టుకెళ్లారు. ఇదిలా ఉండగా మరొక సారి ఈ నెల 27వ తేదీన కొత్త టెండర్లను ఆహ్వానించారు. దీంతో గతంలో టెండర్ దక్కించుకున్న నాగేంద్ర ఇన్‌ఫ్రా హైకోర్టుకు వెళ్లింది. గతంలో టెండర్లు వేశారని, దాంట్లో తాము దక్కించుకున్నామని, కానీ వాటిని రద్దు చేయడం సరి కాదని, ప్రస్తుతం కొత్తగా వేసిన టెండర్లు రద్దు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో హైకోర్టు ఆ టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై జిల్లా మైనింగ్ శాఖ అధికారిని సంప్రదించగా ఇంకా తమకు ఉత్తర్వులు అందలేదని తెలిపారు. ఉత్తర్వులు అందిన తరువాత జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment