● సూత్రధారుల చరిత్రపై ఆరా
కావలి: ఊయల్లోని చిన్నారి కిడ్నాప్ కేసు లో ప్రధాన సూత్రధారులైన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని అపహరించిన నిందితురాలు శెట్టిపల్లి స్వరూప తాను పెంచుకునేందుకే అని తొలుత చెప్పినప్పటికీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని కిడ్నాప్ చేసి విక్రయించినట్లు, ఇందులో భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలియడంతో పోలీసులు మరింత లోతుగా శోధిస్తున్నారు. పట్టణంలోని బాలకృష్ణారెడ్డినగర్‌కు చెందిన పెరణంపాటి అశోక్ నిందితురాలు స్వరూపతో పాటు కారులో పొన్నవోలు పోలీసులకు పట్టుబడ్డాడు. కారుడ్రైవర్ స్థానిక జనతాపేటకు చెందిన షేక్ నజీమ్ కావడంతో అతని కార్యకలాపాలపై పోలీసులు నిశితంగా విచారిస్తున్నారు. ఏఎస్‌పేట మండలం పొనుగోడుకు చెందిన గంగవరపు ఉపేంద్ర చిన్నారిని కొనుగో లు చేసేందుకు స్వరూపకు రూ. 1.10 లక్షలు ఇచ్చినట్లు తేలింది. స్వరూపపై గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోవడంతో ఈ వ్యవహారంలో ఆమె పాత్ర స్వల్పంగా భావిస్తున్నారు. ఈ ముగ్గురు వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్నారు. వీరు చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి విక్రయించే ముఠాగా ఏర్పడి ఇటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నా రా? అనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. వీరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చడంతో వీరి దర్యాప్తు కొలిక్కి వస్తే.. కోర్టు అనుమతితో తమ కస్టడీకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment