జీఐఎస్‌ సర్వేను త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీఐఎస్‌ సర్వేను త్వరగా పూర్తి చేయాలి

Published Wed, Apr 17 2024 12:15 AM | Last Updated on Wed, Apr 17 2024 12:15 AM

తల్లితో సబ్‌కలెక్టర్‌ విద్యాధరి, కృష్ణ శ్రీవాస్తవ   - Sakshi

తల్లితో సబ్‌కలెక్టర్‌ విద్యాధరి, కృష్ణ శ్రీవాస్తవ

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జీఐఎస్‌ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ విజయన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నగరంలోని విద్యుత్‌ భవన్‌లోని తన చాంబర్‌ నుంచి విద్యుత్‌ ఈఈలు, డీఈఈలు, ఏఈలు, అకౌంట్స్‌ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏఎస్‌పేట, అనంతసాగరం, ఆత్మకూరు రూరల్‌, వింజమూరు, కావలి, దుత్తలూరు, ఇందుకూరుపేట, సీతారామపురం సెక్షన్ల పరిధిలో జీఐఎస్‌ సర్వే పనులు ఇంకా పూర్తవలేదని తెలిపారు. ఇప్పటికే ఆయా సెక్షన్ల అధికారులను పలుమార్లు హెచ్చరించామన్నారు. ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. బిట్రగుంట, బోగోలు ఫీడర్లకు సంబంధించిన సిబ్బంది బుధవారం నాటికి పనులు పూర్తి చేయపోతే వెంటనే వారిని రిలీవ్‌ చేయాలని కావలి ఈఈను ఆదేశించారు.

అక్క ఐఏఎస్‌..

తమ్ముడికి సివిల్స్‌ ర్యాంక్‌

కందుకూరు: కందుకూరు సబ్‌కలెక్టర్‌ విద్యాధరి తమ్ముడు కృష్ణ శ్రీవాస్తవ మంగళవారం వెలువడిన సివిల్స్‌–2023 ఫలితాల్లో ఆల్‌ ఇండియా 444వ ర్యాంకు సాధించాడు. ఈ మేరకు తన తమ్ముడు సివిల్స్‌ ర్యాంకు సాధించినట్లు సబ్‌కలెక్టర్‌ విద్యాధరి వెల్లడించారు. ఒకే ఇంట్లో అక్కా, తమ్ముడు ఐఏఎస్‌ అధికారులుగా రాణించనున్నారు. వైఎస్సార్‌ జిల్లా నందలూరు మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన విద్యాధరి సివిల్స్‌–2020 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 211వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. శిక్షణానంతరం ఆమె మొదటి పోస్టింగ్‌గా ప్రస్తుతం కందుకూరు సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే బాటలో ఆమె తమ్ముడు కృష్ణ శ్రీవాస్తవ సివిల్స్‌ రాసి విజయం సాధించాడు. ఆయన 2023లో గ్రూప్‌–1 రాసి విజయం సాధించారు. జిల్లా రిజిస్ట్రార్‌గా ఎంపికై రిజిస్ట్రేషన్‌ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సివిల్‌ సర్వీస్‌ పరీక్ష రాసిన ఆయన మంగళవారం వెలువడిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 444వ ర్యాంకు సాధించడంతో సబ్‌కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపారు.

వీఏఏపై కేసు నమోదు

సీతారామపురం(ఉదయగిరి):సీతారామపురం మండలం బాలాయపల్లి సచివాలయంలో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కే వెంకటపతి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో ఎస్సై అనూష మంగళవారం కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం ద్వారా వేతనాలు పొందుతున్న వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. అయినప్పటికీ కొందరు ఖాతరు చేయకుండా రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అధికారులు కేసులు నమోదుచేసి సస్పెండ్‌ చేస్తున్నారు. అయినా ఇంకా కొందరు ఉద్యోగులు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తుండటం విశేషం.

మీ వాడ్ని.. మీలో ఒకడ్ని

నెల్లూరు సిటీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్‌ను వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి మంగళవారం సందర్శించారు. వ్యాపారులు, కూలీలతో మాటామంతి నిర్వహించి వారి యోగక్షేమాలను ఆరాతీశారు. మీ వాడ్ని.. మీలో ఒకడ్ని అంటూ వారితో మమేకమై భరోసా కల్పించారు. జగనన్న సారథ్యంలో ప్రభుత్వం మరోసారి ఏర్పడిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారి అవతారమెత్తి కూరగాయలను విజయసాయిరెడ్డి విక్రయించగా, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కొనుగోలు చేసి అక్కడి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కూరగాయలు విక్రయిస్తున్న విజయసాయిరెడ్డి 1
1/2

కూరగాయలు విక్రయిస్తున్న విజయసాయిరెడ్డి

మాట్లాడుతున్న 
ఎస్‌ఈ విజయన్‌ 2
2/2

మాట్లాడుతున్న ఎస్‌ఈ విజయన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement